IND vs END Third Test: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్ల పట్ల మళ్లీ జాతి దురహంకారం బట్టబయలైంది. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ లో పర్యటిస్తోంది. రెండో టెస్టులో ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ అభిమానులు మూడో టెస్టులో భారత ఆటగాళ్లను టార్గెట్ చేశారు. ముఖ్యంగా రెండో టెస్టులో వికెట్లు తీసి మ్యాచ్ ను మలుపుతిప్పిన మహ్మద్ సిరాజ్ ను టార్గెట్ చేశారు.
రెండో టెస్ట్ మ్యాచ్ లో సెంచరీతో మ్యాచ్ ను భారత్ వైపు మళ్లించిన కేఎల్ రాహుల్ పై ఇటీవలే వాటర్ బాటిల్ మూతలను విసిరిన ఘటన మరువకముందే మూడో టెస్టు తొలి రోజు సిరాజ్ ను లక్ష్యంగా చేసుకొని బంతిని విసిరారు. అంతేకాకుండా స్కోర్ ఎంత అంటూ గేలిచేసే ప్రయత్నం చేశారు. దీనిపై కెప్టెన్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సిరాజ్ మాత్రం అదిరిపోయే కౌటర్ ఇచ్చాడు.
స్కోర్ ఎంత అని భారత్ తక్కువ స్కోరు ఆలౌట్ అయ్యిందని ఇంగ్లండ్ అభిమానులు గేలి చేయగా.. బంతులు విసరగా.. సిరాజ్ మాత్రం సీరీస్ 1-0 అంటూ గట్టి కౌంటర్ ను ఇంగ్లండ్ ప్రేక్షకులకు ఇచ్చాడు.
ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తుండగా బౌండరీ లైన్ వద్ద సిరాజ్ ఫీల్డింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానుల్లో ఎవరో బంతిని విసిరారు. ఇది చూసిన కెప్టెన్ కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. బంతిని తిరిగి వారి వైపే విసరాలని సిరాజ్ కు సైగ చేశాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే టీమిండియా కుప్పకూలింది. భారత టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఇంగ్లండ్ తొలి రోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. దీంతో 42 పరుగుల ఆధిక్యంలో ఉంది.