
నెలన్నరరోజులుగా ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్న టీమిండియాకు మ్యాచ్ కు ఒకరోజు ముందు భారీ దెబ్బ తగిలింది. ఈ అయిదు మ్యాచ్ లో సిరీస్ ప్రారంభానికి ముహూర్తం సమీపించిన వేళ ఒక కీలక ఓపెనర్ గాయపడడం జట్టు కూర్పును దెబ్బతీసినట్టైంది.
ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్ తో భారత్ ఐదు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టు జరుగబోతోంది. మధ్యాహ్నం 3.30 గంటలకు టాస్ పడి మ్యాచ్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఈ సిరీస్ సాగనుంది. దీనికోసం రెండు జట్లు ఇప్పటికే కఠోర సాధన మొదలుపెట్టాయి.ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ ప్రాక్టీసే టీమిండియా కొంప ముంచింది.
నెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ గాయపడడం వల్ల జట్టు కూర్పు మొత్తం చిందరవందరగా తయారైంది. తొలి టెస్ట్ మ్యాచ్ చివరి నిమిషంలో ఇప్పుడు జట్టు కూర్పును మార్చాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇప్పటిదాకా రోహిత్ శర్మతో కలిసి మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేయాలని టీం మేనేజ్ మెంట్ కూర్పును సిద్ధం చేసింది. కేఎల్ రాహుల్ ను మిడిల్ ఆర్డర్ లో ఆడించాలని అనుకుంది. అయితే మయాంక్ అగర్వాల్ గాయపడడంతో ఇప్పుడు కేఎల్ రాహుల్ ఓపెనర్ గా మారనున్నారు. ఫృథ్వీ షా వస్తే కానీ కేఎల్ రాహుల్ మళ్లీ మిడిల్ ఆర్డర్ కు పంపడం సాధ్యం కాకపోవచ్చు.
శ్రీలంకలో ఉన్న ఫృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ లు ఇంకా ఇంగ్లండ్ కు రావాల్సి ఉంది. వాళ్లిద్దరూ జట్టులో చేరితే ఓపెనర్ ఇబ్బందులు ఉండకపోవచ్చు.
ఇక రెండేళ్ల తర్వాత కేఎల్ రాహుల్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. మాయాంక్ కంటే కేఎల్ రాహుల్ కే ఇంగ్లండ్ లో ఆడిన అనుభవం ఉంది. ఒకసెంచరీ కూడా చేశాడు.
ఫస్ట్ మ్యాచ్ కోసం ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియాన్ని పచ్చికతో సిద్ధం చేశారు. పేసర్లకు అనుకూలం. దీంతో ఫస్ట్ మ్యాచ్ కోసం భారత్ ఒక స్పిన్నర్ నే తీసుకునే అవకాశం ఉంది. అంటే రవిచంద్రన్ అశ్విన్ లేదా రవీంద్ర జడేజాల్లో ఒకరికే అవకాశం దక్కనుంది. ఎవరిని తీసుకుంటారన్నది వేచిచూడాలి.