Ind Vs Eng 5th Test India Record: సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియా ప్రస్తుతం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. గత ఏడాది స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుచేతిలో వైట్ వాష్ కు గురైంది టీం ఇండియా. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోల్పోయింది.. 8 టెస్టులు ఆడి కేవలం ఒకే ఒక్క విజయం సాధించింది.. ఇక ఇంగ్లాండ్ పై నాలుగు టెస్టులాడి.. ఒక గెలుపును సొంతం చేసుకుంది. మొత్తంగా 12 టెస్టులు ఆడి కేవలం రెండు విజయాలు నమోదు చేసింది.. ఈ నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ ను టీమిండియా మరింత మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఉంది.
Also Read: భారత్ కు వ్యతిరేకంగా.. ఇంగ్లాండ్ కు అనుకూలంగా.. ధర్మసేన దీన్ని అంపైరింగ్ అంటారా..
విజయాల సంగతి పక్కన పెడితే పరుగుల విషయంలో టీమిండియా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియా.. సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఒక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇంగ్లాండ్ జట్టుపై ప్రస్తుత సిరీస్లో 3272+ పరుగులు చేసింది టీం ఇండియా. గతంలో వెస్టిండీస్ జట్టుపై 1978 – 79 కాలంలో చేసిన 3270 పరుగులను టీమ్ ఇండియా బద్దలు కొట్టింది. దీనికంటే ముందు 2016 -17 లో ఇంగ్లాండ్ జట్టుపై టీమిండియా 3,230 పరుగులు చేసింది. 2024లో ఇంగ్లాండ్ జట్టుపై 3140 పరుగులు చేసింది. 1963 -64 లో ఇంగ్లాండ్ జట్టుపై 3119 పరుగులు చేసింది. ప్రస్తుత సిరీస్లో భారత జట్టు ఏకంగా ఏడుసార్లు 350+ పైగా పరుగులు చేయడం విశేషం. ప్రస్తుత సిరీస్లో 700+ పరుగులు చేసి కెప్టెన్ గిల్ టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.. అతని ఖాతాలో ద్విశతకం, శతకాలు ఉన్నాయి.. ఇంగ్లాండ్ లో పర్యటనకు ముందు గిల్ రికార్డ్ అత్యంత పేలవంగా ఉంది.
భారత జట్టు ఈ సిరీస్లో ఒక విజయం సాధించింది. ఇటీవలి మంచెస్టర్ మ్యాచ్ ను అత్యంత విజయవంతంగా డ్రా చేసింది. భారత రెండవ ఇన్నింగ్స్ లో ముగ్గురు ఆటగాళ్లు శతకాలు సాధించారు. రాహుల్ వెంట్రుక వాసిలో శతకాన్ని కోల్పోయాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ ను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటూ టీమిండియా ప్లేయర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అంతేకాదు ఇంగ్లాండ్ జట్టుకు విజయాన్ని దూరం చేశారు. ఇటీవల కాలంలో ఒక మ్యాచ్ ఈ స్థాయిలో ఉత్కంఠ కలిగించడం ఇదే తొలిసారి.. పైగా ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టులు ఐదు రోజుల పాటు జరగడం విశేషం.