Ind Vs Eng 3T20 (1)
IND vs ENG 3rd T20: కోల్ కతా, చెన్నై టి20 మ్యాచ్ లలో గెలిచిన టీమ్ ఇండియా..రాజ్ కోట్ లోనూ విజయం సాధించి సిరీస్ దక్కించుకోవాలని భావించింది. కానీ రాజ్ కోట్ లో మంగళవారం భారత జట్టుకు వ్యతిరేకమైన ఫలితం వచ్చింది. మరోవైపు ఈ సిరీస్ లో నిలబడాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో.. ఇంగ్లాండ్ జట్టు అదరగొట్టింది. రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడవ టి20 మ్యాచ్లో 26 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టు గెలుపును సొంతం చేసుకుంది.
రాజ్ కోట్ లో సాధించిన గెలుపు ద్వారా ఇంగ్లాండ్ జట్టు 5 t20 మ్యాచ్ ల సిరీస్ లో బోణి చేసింది. ఈ మ్యాచ్లో ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఇంగ్లాండ్ ఆటగాడు అదిల్ రషీద్ ను పదేపదే ప్రస్తావించాడు. ఓటమి తర్వాత చాలా సేపు విలేకరులతో మాట్లాడిన సూర్య కుమార్ యాదవ్.. అదిల్ రషీద్ ప్రస్తావనను చాలాసేపు తీసుకొచ్చాడు. అదిల్ రషీద్ దాదాపు నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ వేసాడు. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి, ఒక వికెట్ పడగొట్టాడు. అతడేకంగా భీకరమైన ఫామ్ లో ఉన్న తిలక్ వర్మ (15) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తిలక్ వర్మ అవుట్ కావడంతో మ్యాచ్ మొత్తం ఒక్కసారిగా ఇంగ్లాండ్ వైపు మళ్ళిపోయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా కు కష్టాలు మరింత పెరిగిపోయాయి. ఈ దశలో భారత బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఓటమి తర్వాత సూర్య కుమార్ యాదవ్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు..” మేము ఆడుతున్నప్పుడు మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావించాను. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ క్రీజ్ లో ఉన్నంతవరకు మ్యాచ్ మా చేతిలో ఉందని భావించాను. తిలక్ వర్మ దూకుడుగా ఆడాడు. అయితే రషీద్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తిలక్ వర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతడు అద్భుతంగా బంతులు వేశాడు. బౌండరీ కొట్టడం పక్కన పెడితే కనీసం స్ట్రైక్ రొటేట్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అందువల్లే అతడు వరల్డ్ క్లాస్ బౌలర్ గా అవతరించాడు. ఈ మైదానంపై స్పిన్ బౌలర్లకు సహకారం ఎక్కువగా లభిస్తుందనే వారిని ఎక్కువగా తీసుకున్నాం. బౌలింగ్ విభాగం కూడా చక్కగా చేసింది. ఇలాంటి ఇబ్బంది కూడా లేదు. బ్యాటింగ్ విభాగంపై మరింత దృష్టి సారించాల్సి ఉంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. తదుపరి మ్యాచ్లలో ఇటువంటి తప్పులను పునరావృతం కాకుండా చేసుకుంటామని” సూర్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు.
మ్యాచ్ ఇలా సాగింది..
రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడవ టి20 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్ల లాస్ అయ్యి.. 171 రన్స్ మాత్రమే చేసింది. డకెట్ 28 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. లివింగ్ స్టోన్ 24 బంతుల్లో ఒక ఫోర్, 5 సిక్సర్ల సహాయంతో 43 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో వరం చక్రవర్తి అయిదు వికెట్లు సొంతం చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు దక్కించుకున్నాడు, రవి, అక్షర్ చెరొక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇంగ్లాండ్ జట్టు విధించిన లక్ష్యాన్ని చేదించడంలో భారత్ ప్రారంభం నుంచి తడబడింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 రన్స్ వద్దే ఆగిపోయింది.. హార్దిక్ పాండ్యా 40 పరుగులతో ఆకట్టుకున్నాడు., అభిషేక్ శర్మ 24 రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఓవర్టన్ మూడు, అర్చర్, కార్సే చెరి 2 వికెట్లు పడగొట్టారు. మార్క్ వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు.