Ind Vs Eng 1st T20: ఈ మ్యాచ్ లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) మైదానంలో విధ్వంసం సృష్టించాడు. 34 బంతుల్లో ఐదు ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 79 పరుగులు చేశాడు. క్రీజ్ లోకి వచ్చిన నాటి నుంచే ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత.. అభిషేక్ శర్మ తన దూకుడు మొదలు పెట్టాడు. స్కోర్ బోర్డును రాకెట్ వేగంతో పరుగులు పెట్టించాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అభిషేక్ శర్మ దుందుడుకు బ్యాటింగ్ వల్ల భారత్ ఇంగ్లాండ్ విధించిన 133 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలోనే ఫినిష్ చేసింది.. ఆఫ్ సెంచరీ చేసిన తర్వాత అభిషేక్ శర్మ విభిన్నంగా వేడుకలు జరిపాడు. తన బొటనవేలు, చూపుడువేలును పైకి చూపించి.. సాధించాను అన్నట్టుగా సంకేతం ఇచ్చాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అతడు అదేవిధంగా అభివాదం చేశాడు. ఈ సందర్భంగా తనకు మద్దతు ఇచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ కు ధన్యవాదాలు తెలిపాడు.
దానికి కారణం అదే..
మ్యాచ్ ముగిసిన అనంతరం అభిషేక్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ” నాకు అద్భుతమైన అవకాశాన్నిచ్చిన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు ధన్యవాదాలు. ఈ మ్యాచ్ ద్వారా నేను ఏంటో నిరూపించుకోవడానికి ప్రయత్నించాను.. నా కోచ్, నా కెప్టెన్ నా మీద నమ్మకం ఉంచారు. అందుకోసమే అలా చేయాల్సి వచ్చింది. విపరీతమైన స్వేచ్ఛ ఇవ్వడం వల్లే నా నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ వచ్చింది. వారు యువ ఆటగాళ్లతో అద్భుతంగా మాట్లాడతారు. ఈడెన్ గార్డెన్ చిత్రమైన మైదానం. ఇక్కడ బౌలర్లకు ఎంత సహకారం ఉంటుందో.. బ్యాటర్లకు కూడా అదే స్థాయిలో సపోర్టు ఉంటుంది. మా బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ మైదానంపై ఇంగ్లాండ్ 170 రన్స్ చేస్తుందని భావించాం. కానీ మా బౌలర్లు 132 పరుగుల లోపే ఇంగ్లాండ్ జట్టును ఆల్ అవుట్ చేశారు. నాకు మరో ఓపెనర్ సంజు అద్భుతమైన హ్యాండ్ ఇచ్చాడు. అతని ప్రోత్సాహంతో ఉత్సాహంగా బ్యాటింగ్ చేశాను. ఐపీఎల్ అనుభవం కూడా నాకు ఎంతో ఉపయోగపడింది. జట్టులో ఇంతటి ఉత్సాహపూరితమైన వాతావరణాన్ని గతంలో చూడలేదు. కోచ్ ప్రోత్సహించారు. కెప్టెన్ అండదండలు అందించారు. అందువల్లే ఇంత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగాను. ఇంగ్లాండ్ పేస్ బౌలింగ్ చాలా బాగుంటుంది. అయినప్పటికీ వారిని మేము స్వేచ్ఛగానే ఎదుర్కొన్నాం.. వారు షార్ట్ పిచ్ బంతులను మా పైకి సంధించారు. వాటిని మేము ధైర్యంగా ఎదుర్కొన్నామని” అభిషేక్ శర్మ వ్యాఖ్యానించాడు.