Ind Vs Ban Asia Cup: మొన్నటి పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వాస్తవానికి అతడు ఒక బీస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. అందువల్లే పాకిస్తాన్ అంత భారీగా స్కోర్ చేసినప్పటికీ భారత్ విజయం సాధించగలిగింది. చూస్తుండగానే పరుగుల ప్రవాహం రావడంతో భారీ టార్గెట్ సైతం కరిగిపోయింది. అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్ కు తోడు గిల్ అదరగొట్టడంతో భారత్ పని కాస్త ఈజీ అయిపోయింది. మధ్యలో కెప్టెన్, ఇతర ప్లేయర్లు విఫలమైనప్పటికీ.. తిలక్ వర్మ నిలబడడంతో భారత్ పని సులువు అయింది. అభిషేక్ శర్మ ఆడకపోయి ఉంటే.. తిలక్ వర్మ నిలబడకపోయి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.
పాకిస్తాన్ కాబట్టి కాస్త ఒత్తిడి ఉంటుంది అనుకోవడంలో సహజం. కానీ బంగ్లాదేశ్ మీద కూడా భారత్ అదే తీరు కొనసాగించింది. భారీగా పరుగులు చేయాల్సిన చోట 168 పరుగులకే ఆగిపోయింది. ఇందులో అభిషేక్ శర్మ వే 75 పరుగులు అంటే.. భారత బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.. గిల్ వేగంగా ఆడినప్పటికీ.. త్వరగానే తన ప్రస్తానాన్ని ముగించుకున్నాడు. శివం దుబే రెండు పరుగులు.. సూర్య కుమార్ యాదవ్ అయిదు పరుగులు.. తిలక్ వర్మ అయిదు పరుగులు.. ఇలా తీవ్రంగా నిరాశపరచడంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. మరోవైపు అక్షర్ కూడా కేవలం పది పరుగులు మాత్రమే చేయడం.. దానికి 15 బంతులు ఎదుర్కోవడం ఇబ్బందికరంగా మారింది. వాస్తవానికి బంగ్లాదేశ్ బౌలింగ్ అద్భుతంగా సాగింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత బంగ్లాదేశ్ బౌలర్లు అత్యంత కట్టుదిట్టంగా బంతులు వేశారు. హార్దిక్ పాండ్యా (38) మినహా మిగతా బ్యాటర్లు మొత్తం తేలిపోయారు. కనీసం బంతి ఎదుర్కోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. వాస్తవానికి ఇదే తరహాలో టీమ్ ఇండియా బ్యాటింగ్ కొనసాగితే మాత్రం ఫైనల్ లో పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ జట్టుతో ఇబ్బందికరమైన వాతావరణం తప్పదు. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ ఉత్కంఠ గా సాగితే.. అభిమానులు ఆస్వాదించారు. కానీ బంగ్లాదేశ్ తో కూడా అదే తీరు కొనసాగడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
బ్యాటింగ్ మారాల్సిందే
అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అతడు బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి టీమిండియా కు కలిసి వస్తోంది. ఒకవేళ అతడు గనుక ఆడకపోయి ఉండి ఉంటే పరిస్థితి ఏంటి? సూర్య కుమార్ యాదవ్ ఎట్లాగూ తన నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. సారధిగా అతడి నిర్ణయాలు టీమిండియాకు విజయాలు సాధించి పెట్టవచ్చు. ఏకంగా ఫైనల్ దాకా తీసుకువెళ్లి ఉండవచ్చు. కానీ సూర్య కుమార్ యాదవ్ ఆడుతున్న ఆట మాత్రం బాగోలేదు. సింగిల్ డిజిట్ స్కోర్ కు సారధి అవుట్ కావడాన్ని అభిమానులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అతడు విఫలమవుతున్న తీరు జట్టు మీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తోంది. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ తీసుకుంటే.. సూర్య కుమార్ యాదవ్ విఫలం కావడంతో.. సంజు శాంసన్ కూడా ఒత్తిడికి గురయ్యాడు. చివరికి తిలక్ వర్మ నిలబడ్డాడు కాబట్టి సరిపోయింది. వాస్తవానికి జట్టు సారధిగా సూర్య కుమార్ యాదవ్ స్థిరమైన ఇన్నింగ్స్ ఆడితేనే ఉపయోగకరంగా ఉంటుంది. అస్తమానం అభిషేక్ శర్మ మీద ఆధారపడితే ఆ ఒత్తిడి అతడు కూడా తట్టుకోలేడు. గిల్ వేగానికి మాత్రమే కాకుండా వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తే బాగుంటుంది. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వీరిద్దరూ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా టీమ్ ఇండియాకు తిరుగులేని స్థాయిలో విజయం దక్కింది. అలాంటి భాగస్వామ్యాలే తదుపరి మ్యాచ్ లలో నమోదైతే టీమిండియా మరోసారి ఆసియా చాంపియన్ గా నిలుస్తుంది.