Ind Vs Aus Women Beth Mooney: 3 వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా మహిళల జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే రెండు జట్లు చెరొక మ్యాచ్ లో విజయం సాధించాయి. నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో శనివారం రెండు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు ఆకాశమేహద్దుగా చెలరేగిపోయింది. 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆల్ అవుట్ అయింది. వాస్తవానికి టీం ఇండియా ఎదుట ఇది కొండంత లక్ష్యం. గతంలో ఎన్నడు కూడా ఇంత పెద్ద టార్గెట్ ను భారత్ చేజ్ చేయలేదు. సొంత మైదానం కావడంతో భారత్ ఈ టార్గెట్ ఫినిష్ చేస్తుందా? అనేది చూడాల్సి ఉంది.
ఆస్ట్రేలియా ప్లేయర్లలో బెత్ మూనీ విధ్వంసం సృష్టించింది. 75 బంతుల్లోనే 138 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్ లో ఏకంగా 23 ఫోర్లు ఉన్నాయి. ఈమెతోపాటు జార్జియా 81, పెర్రీ 68, గార్డ్ నర్ 39, హీలి ముప్పై పరుగులు చేశారు. తద్వారా ఆస్ట్రేలియా స్కోర్ ను 412 పరుగులకు చేర్చారు. ప్రారంభం నుంచి చివరి వరకు ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసాన్ని మాత్రమే నమ్ముకున్నారు. త్వరలో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇక్కడి మైదానాలకు పూర్తిగా అలవాటు పడేందుకు ఆస్ట్రేలియా ప్లేయర్లు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే టీమ్ ఇండియాతో జరుగుతున్న సిరీస్ ను అనుకూలంగా మార్చుకుంటున్నారు. మరవైపు మహిళల వన్డేలలో ఆస్ట్రేలియా 400కు పైగా పరుగులు చేయడం రెండవసారి. మొత్తంగా మహిళల వన్డేలలో 400 పరుగులు దాటడం ఇది ఏడవసారి.
భారత్ విజయం సాధించాలంటే 50 ఓవర్లలో 413 పరుగులు చేయాలి. అంటే ఓవర్ కు 8.13 రన్ రేట్ కొనసాగించాలి. అది సాధ్యమవుతుందా.. అనే ప్రశ్న ఇప్పుడు సగటు అభిమానుల్లో వ్యక్తం అవుతుంది. టీమిండియాలో స్మృతి, జమీమా సూపర్ ఫామ్ లో ఉన్నారు. మిగతా ప్లేయర్లు కూడా సత్తా చాటితే ఈ లక్ష్యాన్ని ఫినిష్ చేయడం పెద్ద కష్టం కాదు. కాకపోతే ఒత్తిడిలో టీమిండియా ప్లేయర్లు ఎలా ఆడతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ మ్యాచ్ లో గనుక భారత్ విజయం సాధిస్తే ప్రపంచ కప్ కు ముందు విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకుంటుంది. అంతేకాదు బలమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించి తిరుగులేని సత్తాను అందుకుంటుంది.. మరి ఇవన్నీ సాధ్యమవుతాయా అంటే.. మరికొద్ది గంటల్లో తేలుతుంది.