Ind vs Aus Highlights: 3 వన్డేల సిరీస్ ను టీమిండియా కోల్పోయింది. ఆతిధ్య ఆస్ట్రేలియాను నిలువరించలేకపోయింది. పెర్త్ లో జరిగిన తొలి వన్డేలో ఘోరమైన ఓటమిని ఎదుర్కొన్న టీమిండియా.. రెండవ వన్డేలో రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. తద్వారా ఈ ఏడాది వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయి.. సిరీస్ కోల్పోయింది. ఎంతో బలవంతమైన జట్టు ఉన్నప్పటికీ టీమిండియా సిరీస్ కోల్పోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
పెర్త్ మైదానంలో తరచూ వర్షం కురవడం వల్ల ఆటకు అంతరాయం ఏర్పడింది. దీనివల్ల ప్లేయర్లు బ్యాటింగ్ చేయడంలో ఇబ్బంది పడ్డారు. కానీ రెండవ వన్డేలో టీమిండియా ప్లేయర్లు దారుణమైన ఆట తీరు ప్రదర్శించారు. విరాట్ కోహ్లీ ఎప్పటిలాగానే 0 పరుగులకు అవుట్ అయ్యాడు. కెప్టెన్ గిల్ మరోసారి తన నిర్లక్ష్యపు షాట్ కు మూల్యం చెల్లించుకున్నాడు.. నితీష్ కుమార్ రెడ్డి బాధ్యతారాహిత్యమైన ఆట ఆడాడు. కేఎల్ రాహుల్ బంతిని తప్పుడు అంచనా వేసి అవుట్ అయ్యాడు. చివర్లో హర్షిత్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో కొంతలో కొంత టీమిండియా ఆ స్కోర్ చేయగలిగింది.
ఇక బౌలింగ్లో టీమిండియా తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది.. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో బౌలర్లు విఫలమయ్యారు. దీంతో వచ్చిన అవకాశాలను ఆస్ట్రేలియా ప్లేయర్లు అందిపుచ్చుకున్నారు. సిరాజ్, అక్షర్ పటేల్ కీలకమైన క్యాచ్ లను నేలపాలు చేశారు. ఇవి అత్యంత కాస్ట్లీగా మారిపోయాయి. వచ్చిన జీవధానాలను షార్ట్, రెయిన్ షా సద్వినియోగం చేసుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా విజయం వైపు పరుగులు పెట్టింది. ఒకానొక దశలో టీమిండియా పై చేయి సాధించినట్లు కనిపించినప్పటికీ.. కీలక దశలో చేతులెత్తేసింది. నితీష్ కుమార్ రెడ్డి అటు బంతితో.. ఇటు బ్యాట్ తో విఫలమయ్యాడు. అతడు 3 ఓవర్లు వేసి దాదాపు 24కు మించి పరుగులు ఇచ్చాడు. మిడిల్ ఓవర్లలో టీమిండియా కనుక వికెట్లు తీసి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. ఏది ఏమైనప్పటికీ గంభీర్ చేసిన ప్రయోగం విఫలయత్నమైంది. అంతేకాదు గిల్ కెప్టెన్సీలో టీమిండియా తొలి సిరీస్ కోల్పోయింది.
యంగ్ జట్టుతో 2027 వరల్డ్ కప్ కు సిద్ధం కావాలని భావిస్తున్న తరుణంలో.. టీమిండియా మేనేజ్మెంట్ కు ప్రస్తుత ఫలితం చేదు గుళిక లాగా మారిపోయింది. ఈ ఫలితం నేపథ్యంలో మేనేజ్మెంట్ ప్రయోగాలను పక్కన పెడుతుందా? లేక ఇదే ధోరణి కొనసాగిస్తుందా.. అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. కాకపోతే యంగ్ ప్లేయర్లతో ప్రయోగాలు చేసిన ఆస్ట్రేలియా జట్టు సిరీస్ దక్కించుకుంది. హెడ్, మార్ష్, క్యారీ వంటి వారు విఫలమైనప్పటికీ.. మిగతా ఆటగాళ్లు అదరగొట్టడంతో ఆస్ట్రేలియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.