Ind Vs Aus First Odi 2025 Harshit Rana: పెర్త్ మైదానం పాస్ట్ బౌలర్లకు స్వర్గధామం. పైగా పలుమార్లు వర్షం కురవడంతో మైదానం మీద విపరీతమైన తేమ ఉంది. ఈ తేమను ఉపయోగించి బంతిని అద్భుతంగా స్వింగ్ చేయవచ్చు. రకరకాల మెలికలు తిప్పవచ్చు. ఆస్ట్రేలియా బౌలర్లు ఇదే చేసి నిరూపించారు. స్టార్క్, హేజిల్ వుడ్, ఎల్లిస్, ఓవెన్, కూనె మాన్ ఇదే చేసి నిరూపించారు. వీరంతా కూడా అత్యంత పకడ్బందీగా బౌలింగ్ వేయడంతో టీమిండియా 26 ఓవర్లలో (డిఎల్ఎస్ మెథడ్) 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్ వుడ్, కునేమన్, ఓవెన్ తలా రెండు వికెట్లు సాధించారు. ముఖ్యంగా స్టార్క్, హెజిల్ వుడ్ అత్యంత పటిష్టంగా బంతులు వేశారు. టీమిండియాలో కేఎల్ రాహుల్ 38, అక్షర్ 31 పరుగులతో టాప్ స్కోరర్ లు గా నిలిచారు.
137 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా ప్రారంభంలో తడబడినప్పటికీ.. ఆ తర్వాత కుదురుకుంది.. ముఖ్యంగా ఆస్ట్రేలియా బ్యాటర్లు గౌతమ్ గంభీర్ శిష్యుడు హర్షిత్ రాణా బౌలింగ్ లో పండగ చేసుకున్నారు. పరుగుల వరదను పారించారు. వాస్తవానికి ఈ మైదానంపై ఫాస్ట్ బౌలర్లు అదరగొడుతుంటే అతను మాత్రం హాఫ్ స్టంప్ దిశగా బంతులు వేసి.. ఆస్ట్రేలియా బ్యాటర్లకు పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా చేశాడు.. దీంతో ఆస్ట్రేలియా కెప్టెన్ మార్ష్, ఫిలిప్ అదరగొట్టారు. వీరిద్దరూ అతడు బౌలింగ్లో పరుగులు పిండుకున్నారు.. అక్షర్, అర్ష్ దీప్ సింగ్, సిరాజ్ ఫర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు వేస్తుంటే.. హర్షిత్ మాత్రం దారుణంగా బౌలింగ్ వేశాడు. నాలుగు ఓవర్లు వేసిన అతడు 27 పరుగుల సమర్పించుకున్నాడు. అతని బౌలింగ్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అత్యంత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. పిచ్ నుంచి సహకారం ఉన్నప్పటికీ అతడు పకడ్బందీగా బంతులు వేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు.
వాస్తవానికి ఆస్ట్రేలియా మైదానాలు హర్షిత్ కు అలవాటే. బోర్డర్ గవాస్కర్ సిరీస్లో అతడు ఆడాడు. కానీ ఆకట్టుకోలేకపోయాడు.. ఇక ఇటీవల ఆసియా కప్, అంతకుముందు జరిగిన టోర్నీలలో కూడా హర్షిత్ కు అవకాశం వచ్చింది. కానీ అతడు తనను తాను నిరూపించుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా సిరీస్ కు అతడికి చోటు లభించదని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ హర్షిత్ కు చోటు కల్పించాడు. అతడు మాత్రం నేలబారు ఆటతీరుతో మరోసారి తన పరువు తీసుకున్నాడు. వాస్తవానికి ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేస్తే.. టీమ్ ఇండియా బౌలర్లు నిరాశ జనకమైన బౌలింగ్ వేశారు. వారిలో హర్షిత్ అత్యంత దారుణంగా బౌలింగ్ వేశాడు. అతడి గనుక ఇదే స్థాయిలో బౌలింగ్ ప్రదర్శన చేస్తే మునుముందు జట్టులో చోటు లభించడం కష్టమవుతుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
అంతేకాదు హర్షిత్ బౌలింగ్ ప్రదర్శన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ ప్రతి సందర్భంలో హర్షిత్ కు వైల్డ్ కార్డు అవకాశం కల్పిస్తున్నాడని.. ఇలా అయితే కష్టమని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.. జట్టు మీద హర్షిత్ ను బలవంతంగా గంభీర్ రుద్దుతున్నాడని ఆరోపిస్తున్నారు.