Ind Vs Aus 4th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో ఈసారి తెలుగోడు అదరగొడుతున్నాడు. తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి సత్తా చూపిస్తున్నాడు. ఆస్ట్రేలియా బౌన్సీ మైదానాలపై బలమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. హేమా హేమీల లాంటి బౌలర్లు ఉన్నప్పటికీ.. ఏ మాత్రం భయపడకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ముఖ్యంగా మెల్ బోర్న్ టెస్టులో అతడు చేసిన హాఫ్ సెంచరీ జీవితకాలం గుర్తుండిపోతుంది. ఆస్ట్రేలియా బౌలర్లు ప్రతాపం చూపిస్తున్న వేళ.. కీలక ఆటగాళ్లు పెవిలియన్ చేరుకున్న వేళ.. అతడు ఒక్కడే గట్టిగా నిలబడటం.. ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోవడం సులభమైన విషయం కాదు. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వెంట వెంటనే పెవిలియన్ చేరుకున్న సమయంలో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మరో ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తో కలిసి 62 పరుగుల భాగస్వామ్యాన్ని ఎనిమిదో వికెట్ కు నెలకొల్పాడు.. స్టార్క్ బౌలింగ్ లో సూపర్ ఫోర్ కొట్టి తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం పుష్ప స్టైల్ లో.. తగ్గేది లేదు అన్నట్టుగా తన హావభావాన్ని ప్రదర్శించాడు. ఇదే క్రమంలో తనను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నిస్తున్న విమర్శకులకు బ్యాట్ తో సమాధానం చెప్పాడు.
పంత్ విఫలమయ్యాడు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు రిషబ్ పంత్ పై విపరీతమైన అంచనాలు ఉండేవి. ఎందుకంటే అతడు గత సీజన్లో అదరగొట్టాడు. సంచలనమైన బ్యాటింగ్ తో అలరించాడు. కానీ ఈసారి తేలిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు పంత్ ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. తొలి టెస్టులో 38, రెండో టెస్టులో 49, మూడో టెస్టులో 9, నాలుగో టెస్టులో 28 (తొలి ఇన్నింగ్స్ లో) పరుగులు మాత్రమే రిషబ్ పంత్ చేశాడు. రిషబ్ పంత్ బలహీనత పై దృష్టిపెట్టిన ఆస్ట్రేలియా బౌలర్లు.. ఆ దిశగా బంతులు వేస్తూ అతడిని అవుట్ చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు..”గత సీజన్లో రిషబ్ పంత్ అదరగొట్టాడు. టీమిండియా కు భవిష్యత్తు ఆశాకిరణం లాగా మారాడు. కానీ ప్రస్తుత సీజన్లో విఫలమవుతున్నాడు. అతడు అలా ఎందుకు బ్యాటింగ్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్బాంధవుడి పాత్ర పోషించాల్సిన అతడు.. దారుణంగా విఫలమవుతున్నాడు. అదృష్టవశాత్తు అతని పాత్రను తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పోషిస్తున్నాడు. మెల్ బోర్న్ మైదానంలో జరిగింది అదే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయడం పట్ల విమర్శకులు ఆరోపణలు చేశారు. కానీ అతడు తన ఆట తీరుతోనే వారికి సమాధానం చెబుతున్నాడు. మొత్తానికి ఈ సిరీస్ నితీష్ కుమార్ రెడ్డికి ఎంతో ముఖ్యం. ఇకపై అతడు మరింతగా రాటు తేలుతాడని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.