Ind Vs Aus 4th Test: మొదటి, రెండు ఇన్నింగ్స్ లు కలుపుకొని టీమిండియా ఎదుట 340 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియా విధించిన టార్గెట్ ను చేజ్ చేయడానికి రంగంలోకి దిగిన టీమిండియా.. తడబడుతోంది. కడపటి వార్తలు అందే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (82*), వాషింగ్టన్ సుందర్ (2*) క్రీజ్ లో ఉన్నారు. కమిన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. బోలాండ్, లయన్, హెడ్, స్టార్క్ చెరో వికెట్ దక్కించుకున్నారు. విరాట్ కోహ్లీ (5), రోహిత్ శర్మ (9), రాహుల్ (0), నితీష్ కుమార్ రెడ్డి (1), రవీంద్ర జడేజా (2) దారుణంగా విఫలమయ్యారు. రిషబ్ పంత్ (30) పర్వాలేదనిపించినా.. కీలక సమయంలో అనవసర షాట్ కొట్టి పెవిలియన్ చేరుకున్నాడు.
సరికొత్త రికార్డు
ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ ద్వారా మెల్ బోర్న్ మైదానంలో సరికొత్త రికార్డు నమోదయింది. మెల్ బోర్న్ మైదానంలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తద్వారా 1937లో మెల్ బోర్న్ మైదానంలో నమోదైన 3,50,534 రికార్డును అధిగమించారు. ప్రస్తుతం నాలుగో టెస్ట్ జరుగుతున్న ఈ మైదానంలో 3,50,700 కంటే ఎక్కువ ప్రేక్షకులు హాజరయ్యారని తెలుస్తోంది. సోమవారం ఐదో రోజు మొదటి సెషన్ కు 51,371 మంది హాజరయ్యారని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. మధ్యాహ్నం తర్వాత ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. 1937లో జనవరి నెలలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య బాక్సింగ్ డే టెస్ట్ జరిగింది. ఆ టెస్టులో ఆస్ట్రేలియా జట్టుకు బ్రాడ్ మన్ నాయకత్వం వహించాడు. నాటి మ్యాచ్ ఆరు రోజుల పాటు సాగింది. మెల్ బోర్న్ మైదానంలో ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో తొలిరోజు 87,242, రెండవ రోజు 85,147, మూడవరోజు 83,073, నాలుగవ రోజు 43,867, ఐదో రోజు 51,371 ప్రేక్షకులు హాజరయ్యారు. నాలుగు రోజుల నుంచి ఐదో రోజు ప్రేక్షకులు హాజరు కావడం పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రేక్షకులు భారీగా హాజరు కావడంతో మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పక్కనే ఉన్న యర్రా పార్క్ కిక్కిరిసిపోయింది. అక్కడ తాత్కాలికంగా పార్కింగ్ సౌకర్యానికి కల్పించారు. అయినప్పటికీ ట్రాఫిక్ జామ్ అయింది. 2022లో టి20 ప్రపంచ కప్ లో మెల్ బోర్న్ మైదానంలో భారత్, పాకిస్తాన్ తలపడ్డాయి. నాటి మ్యాచ్లో 90,293 ప్రేక్షకులు హాజరయ్యారు. ప్రేక్షకులు భారీగా హాజరు కావడంతో.. వారికి నచ్చిన ఆహారాన్ని మెల్బోర్న్ క్రికెట్ మైదానం నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. ఫ్రైడ్ చికెన్, పిజ్జా, బర్గర్, పాస్తా కౌంటర్లను విరివిగా ఏర్పాటు చేశారు. దీంతో ఫుడ్ స్టాల్స్ వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. అసలే చలి వాతావరణం కావడంతో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఫ్రైడ్ చికెన్ లాగిస్తూ కనిపించారు. అయితే వచ్చిన ప్రేక్షకుల్లో ఇండియా మద్దతుదారులే ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది.