T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ లో.. గ్రూప్- ఏ జట్ల ముఖచిత్రం ఎలా ఉందంటే..

టీమిండియా జట్టుకూర్పు ఈసారి సమతూ కంగా కనిపిస్తోంది. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కప్ సాధించాలనే కృత నిశ్చయంతో టీమిండియా ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 28, 2024 11:48 am

T20 World Cup 2024

Follow us on

T20 World Cup 2024:  ఐపీఎల్ ముగిసింది. కోల్ కతా విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో జూన్ రెండు నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా t20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.. ఈసారి వరల్డ్ కప్ లో 20 జట్లు పోటీ పడనున్నాయి. ఇందులో గ్రూప్ – ఏ లో భారత్, పాకిస్తాన్, అమెరికా, కెనడా, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. ఇందులో ఆయా జట్లకు సంబంధించి బలాబలాలను ఒకసారి పరిశీలిస్తే..

టీమిండియా

టీమిండియా జట్టుకూర్పు ఈసారి సమతూ కంగా కనిపిస్తోంది. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కప్ సాధించాలనే కృత నిశ్చయంతో టీమిండియా ఉంది. పైగా టి20 ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, అక్షర్ పటేల్, బుమ్రా, యజువేంద్ర చాహల్, సంజు సాంసన్, శివం దూబే, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్ వంటి వారితో టీమిండియా అత్యంత బలంగా కనిపిస్తోంది.. 2007 తర్వాత.. ఇంతవరకు టీమిండియా టి20 వరల్డ్ కప్ దక్కించుకోలేదు.. ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని రోహిత్ సేన యోచిస్తోంది. జూన్ 5న తన తొలి మ్యాచ్ ఐర్లాండ్ జట్టుతో టీమిండియా ఆడుతుంది. ఆ తర్వాత జూన్ 9న న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్ జట్టుతో తలపడుతుంది. జూన్ 12న న్యూయార్క్ వేదికగా అమెరికాతో, జూన్ 15న ఫ్లోరిడా వేదికగా కెనడా జట్టుతో తలపడుతుంది.

పాకిస్తాన్

ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ ను పాకిస్థాన్ సమం చేసుకుంది. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టి20 సిరీస్ లో అంతగా ప్రభావం చూపించలేకపోతోంది. ఈ జట్టు కూడా టి20 వరల్డ్ కప్ సాధించాలని భావిస్తోంది. బాబర్, రిజ్వాన్, ఆయుబ్, ఫఖర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్.. వంటి వారితో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది.. షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, అబ్రార్ అహ్మద్, స్పిన్ దళానికి నేతృత్వం వహిస్తున్నారు.. షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, మహమ్మద్ అమీర్, అబ్బాస్ ఆఫ్రిదీ వంటి వారితో పేస్ బౌలింగ్ అత్యంత బలంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ జట్టు జూన్ 6న అమెరికాతో, జూన్ 9న భారత్ తో, జూన్ 11న కెనడాతో, జూన్ 16న ఐర్లాండ్ జట్టుతో తలపడనుంది.

ఐర్లాండ్

వరుసగా 8వ టి20 ప్రపంచ కప్ లో ఈ జట్టు పాల్గొంటున్నది. ఆ దేశంలో అభివృద్ధి చెందుతున్న క్రికెట్ పరిణామ క్రమానికి ఇది నిదర్శనం. గత రెండు ప్రపంచ కప్ లలో ఐలాండ్ జట్టుకు ఆండ్రు బల్బీర్నీ నాయకత్వం వహించాడు. ప్రస్తుత జట్టుకు పాల్ స్టిర్లింగ్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ జట్టు బ్యాటింగ్ ప్రధాన బలం బల్బీర్ని, స్టిర్లింగ్ ద్వయం అనడంలో ఎటువంటి సందేహం లేదు. హారి టెక్టర్, లోర్కాన్ టక్కర్, రాస్ ఆ డైర్, కర్టీస్ కాంఫర్ వంటి వారు మెరుగ్గా ఆడగలరు.. మార్క్ అడైర్, జోష్ లిటిల్ వంటి వారు బౌలింగ్ భాగంలో కీలకంగా ఉన్నారు. హ్యూమ్, కాంఫర్, బారీ మెక్ కార్తీ, క్రయింగ్ వంటి వారు కూడా బంతితో మాయ చేయగలరు. బెన్ వైట్, గారెత్ డెలాని వంటి వారు స్పిన్ బౌలింగ్ లో అద్భుతాలు చేయగలరు. ఐర్లాండ్ జట్టు జూన్ 5న భారత్, జూన్ 7న కెనడా, జూన్ 14న అమెరికా, జూన్ 16న పాకిస్తాన్ జట్లతో తలపడుతుంది.

అమెరికా

ఈ టి 20 ప్రపంచకప్ ద్వారా అమెరికా జట్టు తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నది. 2004లో ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా ఐసీసీ మెగా టోర్నీలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది. మొనాంక్ పటేల్ అమెరికా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అరోన్ జోన్స్, స్టీవెన్ టేలర్ వంటి వారితో బ్యాటింగ్ లైనప్ లో కీలకంగా ఉంది. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు కోరి అండర్సన్ ను చేర్చుకోవడం.. అమెరికా మిడిల్ ఆర్డర్ కు మరింత బలం. సౌరభ్ నేత్రవల్కర్, మిలింద్ కుమార్, అలీ ఖాన్ వంటి ఆటగాళ్లు సత్తా చాట గలరు. అమెరికా జట్టు జూన్ 1న కెనడాతో, జూన్ 6న పాకిస్తాన్ తో, జూన్ 12న ఇండియాతో, జూన్ 14న ఐర్లాండ్ జట్టుతో తల పడనుంది.

కెనడా

అమెరికా మాదిరే కెనడా జట్టు కూడా.. ఈ ప్రపంచకప్ ద్వారానే పొట్టి క్రికెట్లోకి అడుగుపెడుతోంది. కెనడా జట్టుకు క్రికెట్ కొత్తేమీ కాదు. కెనడా జట్టు1979లోనే 50 ఓవర్ల ప్రపంచకప్ ఆడింది. 2003, 2007, 2011 లో వరుస ప్రపంచ కప్ లలో ఆడింది.. సాద్ బిన్ జాఫర్ కెనడా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.. కన్వర్ పాల్, జెరేమిగోర్డాన్, జునైద్ సిద్ధికి వంటి వారు కెనడా జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. కెనడా జట్టు జూన్ 1న అమెరికా, జూన్ 7న ఐర్లాండ్, జూన్ 11న పాకిస్తాన్, జూన్ 15న భారత జట్లతో మ్యాచ్ లు ఆడనుంది.