IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రయాణం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. గత ఐదారు సీజన్ల నుంచి ఒకే విధమైన ఆటతీరుతో అభిమానులను తీవ్ర నిరాశ పరుస్తోంది. తాజాగా జరుగుతున్న 16వ ఎడిషన్ లోను ఈ జట్టు ప్రయాణం దాదాపు ముగిసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో లక్నో జట్టుపై ఓటమి పొంది ప్లే ఆఫ్ కు వెళ్ళే అవకాశాలను జారవిడుచుకుంది. దీంతో హైదరాబాద్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ ప్రయాణం ముగిసినట్టు అయింది.
ఐపీఎల్ లో గత కొన్ని సీజన్ల నుంచి హైదరాబాద్ జట్టు ఆశించిన స్థాయిలో ఆట తీరు ప్రదర్శించడం లేదు. దారుణమైన ప్రదర్శనతో అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తోంది. ముఖ్యంగా గత ఐదు, ఆరు సీజన్ల ఆట తీరు పరిశీలిస్తే అత్యంత దారుణంగా ఉందనే చెప్పాలి. ప్రతి సీజన్ లోను పాయింట్ల పట్టికలో చివరి నుంచి ఒకటి, రెండు, మూడు స్థానాల్లో హైదరాబాద్ జట్టు ఉంటుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది కూడా ఆడిన 11 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు మాత్రమే సాధించి ఎనిమిది పాయింట్లతో పాయింట్లు పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఏడు మ్యాచ్ ల్లో ఘోర పరాభవాన్ని చవి చూసింది హైదరాబాద్ జట్టు.
ఈ ఏడాది ప్రయాణం ముగిసినట్టే..
ఐపీఎల్ తాజా ఎడిషన్ లో హైదరాబాద్ జట్టు ప్రయాణం దాదాపు ముగిసినట్టే. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో శనివారం హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది. లక్నో జట్టుతో జరిగిన ఈ మ్యాచ్ లో ఆరు వికెట్ల నష్టానికి హైదరాబాద్ జట్టు 182 పరుగులు చేసింది. డిఫెండ్ చేసుకునే స్కోరే అయినప్పటికీ.. హైదరాబాద్ జట్టు బౌలర్లు తేలిపోవడంతో లక్నో జట్టు సునాయాసంగా విజయం సాధించింది. లక్నో జట్టు మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 185 పరుగులను మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే చేసి విజయం సాధించింది.
గడిచిన మూడు ఎడిషన్లలో దారుణమైన ఆట తీరు..
గడచిన మూడు ఎడిషన్లలో హైదరాబాద్ జట్టు దారుణమైన ఆట తీరును కనబరుస్తోంది. 2021లో హైదరాబాద్ జట్టు ఆడిన పది మ్యాచ్ ల్లో ఎనిమిది పరాజయాలు, రెండు విజయాలతో పాయింట్లు పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. గత ఏడాది నిర్వహించిన ఎడిషన్ లో హైదరాబాద్ జట్టు ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆడిన 14 మ్యాచ్ ల్లో ఆరు విజయాలు, ఎనిమిది పరాజయాలతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది హైదరాబాద్. ఇక తాజా ఎడిషన్ లో అయితే హైదరాబాద్ జట్టు పరిస్థితి మరింత అద్వానంగా తయారయింది. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ ల్లో 7 ఓటములు, నాలుగు విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
సారధులు మారిన.. తలరాత మారలే..
హైదరాబాద్ జట్టుకు ఆటగాళ్లతోపాటు కెప్టెన్లు మారుతున్న ఫలితం మాత్రం రావడం లేదు. 2015 నుంచి తాజాగా జరుగుతున్న ఎడిషన్ వరకు ఐదుగురు కెప్టెన్లు మారినప్పటికీ జట్టుకు ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కడం లేదు. ఈ సీజన్ లో జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్న మార్క్రమ్ జట్టును విజయ పథంలో నడిపిస్తాడని ఆశించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పది మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించిన మార్క్రమ్ జట్టుకు నాలుగు విజయాలను మాత్రమే అందించాడు. మార్క్రమ్ కంటే ముందు హైదరాబాద్ జట్టుకు మనీష్ పాండే, భువనేశ్వర్ కుమార్, కేన్ విలియమ్స్ న్ వ్యవహరించారు. 2016లో హైదరాబాద్ జట్టు తొలిసారి ఐపిఎల్ కప్ ను డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఒడిచిపట్టింది. ఆ తర్వాత నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేక భంగపడుతోంది. ఆశగా అభిమానులు రావడమే తప్పా ప్రయోజనం ఉండడం లేదు.
Web Title: In ipl the endless misery of our sunrisers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com