Virat And Rohit: కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టారు. ఒక మామూలు ఆటగాడిని చేశారు. పైగా అతని వయసు 37 సంవత్సరాలు.. ఇంతటి వయసులో అతడు ఇంకా క్రికెట్ ఏం ఆడతాడు.. జట్టులో ఎలా కొనసాగుతాడు.. రోహిత్ గురించి కొద్దిరోజులుగా మీడియాలో జరుగుతున్న చర్చ ఇది..
లండన్ లో స్థిరపడ్డాడు. బీసీసీఐ చెప్పినట్టుగా సాధన చేయడం లేదు. ఒక పట్లగా అతని బ్యాటింగ్లో దూకుడు లేదు. వయసు కూడా మీద పడుతోంది. శరీర సామర్థ్యం మెరుగ్గా ఉన్నప్పటికీ.. ఒక పట్లగా అతడి నుంచి మెరుగైన ఇన్నింగ్స్ రావడం లేదు. ఇలాగైతే కష్టమే. విరాట్ గురించి వినిపిస్తున్న విశ్లేషణ ఇది..
టీమిండియాలో రోహిత్, విరాట్ ద్వయం సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. వీరిద్దరూ ఒకరకంగా టీమిండియా క్రికెట్ మొత్తాన్ని శాసించారు. కొన్ని సందర్భాలలో ఓటములను కూడా తప్పించి టీమ్ ఇండియాకు విజయాలు అందించారు. తద్వారా తమకంటూ సరికొత్త చరిత్రను సృష్టించుకున్నారు. అటువంటి ఆటగాళ్లు నేడు జట్టులో మామూలు ప్లేయర్లుగా మిగిలిపోయారు. మేనేజ్మెంట్ సైతం శాసించిన వీరిద్దరూ ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండిపోయారు. వీరిద్దరి అనుభవం టీమ్ ఇండియాకు ఇప్పుడు చాలా అవసరం. ముఖ్యంగా 2027లో వన్డే వరల్డ్ కప్ సాధించాలి అనుకుంటే టీమిండియాలో వీరిద్దరూ కచ్చితంగా ఉండాలి. కానీ మేనేజ్మెంట్ ఆలోచనలు ఆ విధంగా లేవు. 2027 వరల్డ్ కప్ విషయంలో మేనేజ్మెంట్ లెక్కలు వేరే ఉన్నాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంతవరకు క్లారిటీ లేకపోయినప్పటికీ.. జరుగుతున్న పరిణామాలు మీడియాలో వస్తున్న వార్తలకు బలం చేకూర్చుతున్నాయి. ఈ నేపథ్యంలో 2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్, విరాట్ జట్టులో ఉండాలంటే మేనేజ్మెంట్ ఒక ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ దానికి గనక రోహిత్, విరాట్ కట్టుబడి ఉంటే కచ్చితంగా 2027 వరల్డ్ కప్ లో వారిద్దరు ఆడతారని తెలుస్తోంది.
ఆటగాళ్లలో సామర్థ్యం పెంచడానికి మేనేజ్మెంట్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ ప్రయత్నాలను ఆటగాళ్లు కచ్చితంగా నూటికి నూరు శాతం చేయాలని మేనేజ్మెంట్ బలంగా కోరుతోంది. మేనేజ్మెంట్ తీసుకొచ్చిన ఈ నిబంధనల వల్ల టీమ్ ఇండియాలో కాస్త మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా టెస్ట్ ఫార్మేట్లో టీమ్ ఇండియా మెరుగైన ఆట తీరు కనిపిస్తోంది. ఇంగ్లాండ్ సిరీస్లో ట్రోఫీ దక్కించుకోలేకపోయినప్పటికీ.. ప్రత్యర్థికి గెలిచే అవకాశం ఇవ్వలేదు టీం ఇండియా. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో వెస్టిండీస్ జట్టు పై ఏకపక్ష ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇవన్నీ కూడా మంచి శకునములుగా ఉండడంతో వీటిని కొనసాగించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.
అందువల్లే విరాట్, రోహిత్ తమ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కట్టుదిట్టమైన విధానాలను పాటించాలని మేనేజ్మెంట్ సూచిస్తుంది. అందువల్లే వారిద్దరూ వీలు దొరికిన ప్రతి సందర్భంలోనూ దేశవాళీ క్రికెట్ ఆడాలని నిబంధనలు విధించింది. వారిద్దరి మాత్రమే కాదు.. మిగతా ప్లేయర్లు కూడా తమ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి.. డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని సూచిస్తోంది. ఇప్పటికే t20, టెస్ట్ ఫార్మాట్లకు రోహిత్, విరాట్ వీడ్కోలు పలికారు. అలాంటప్పుడు వన్డేలలో వారు 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగాలి అంటే కచ్చితంగా మేనేజ్మెంట్ చెప్పినట్టు వినాలి. ఇప్పటికే రోహిత్ ఆ పని చేస్తున్నప్పటికీ.. ఒక విరాట్ మాత్రం అంతగా ప్రాక్టీస్ చేయడం లేదని తెలుస్తోంది. ఒకవేళ విరాట్ గనుక రోహిత్ బాటలో ప్రయాణం చేస్తే.. వీరిద్దరూ 2027 వరల్డ్ కప్ లో జట్టులో ఆడతారు.