TVK Vijay: ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ తమిళనాడు రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. సాధారణంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ఉంటాయి. కానీ తమిళనాడులో మాత్రం విచిత్రంగా అధికార డిఎంకె, టీవీకే మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఆరోపణలు, ప్రతి ఆరోపణలు సాగుతున్నాయి. ఇంకా క్షేత్రస్థాయిలో నిర్మాణాన్ని కూడా పూర్తిస్థాయిలో చేసుకోని టీవీకే అధికార డిఎంకెకు అన్ని విషయాలలో సవాల్ విసురుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా డీఎంకే పార్టీలో కీలక నాయకులు చేసిన అవినీతిని ఆధారాలతో సహా బయట పెడుతోంది. దీంతో అధికార డిఎంకె ఎలాగైనా సరే విజయ్ ని ఇబ్బంది పెట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కరూర్ తొక్కిసలాట ఘటనను తెరపైకి తెస్తోంది.
ఇటీవల మద్రాస్ హైకోర్టు కరూర్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల మండిపడింది. విజయ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నేరుగా ప్రశ్నించింది. 41 మంది చనిపోతే సుమోటో కేసుతో ఇద్దరు కిందిస్థాయి నేతలని అరెస్టు చేస్తారా అంటూ మండిపడింది. విజయ్ పై చర్యలు తీసుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు తీవ్రస్థాయిలో మొట్టికాయలు వేసిన నేపథ్యంలో డిఎంకె ప్రభుత్వం విజయ్ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వం గనుక విజయ్ మీద కేసులు పెట్టి.. అరెస్టు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై టీవీ కే నేతలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
విజయ్ మాత్రం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న తగ్గేది లేదు అన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన ఒక సెల్ఫీ వీడియో ద్వారా కరూర్ ఘటన సంబంధించిన అసలు విషయాలను బయటపెట్టారు. తనను ఏమైనా చేసుకోవచ్చని.. తన అభిమానులను.. నాయకులను ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. దీనిని బట్టి చూస్తే విజయ్ ప్రభుత్వంతో దేనికంటే దానికి సిద్ధమని సంకేతాలు ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఒకవేళ విజయ్ ని కనుక అరెస్టు చేస్తే ప్రజలలో అతడికి సింపతి వచ్చే అవకాశం ఉందని.. అందువల్లే అరెస్టుకు ప్రభుత్వం వెనుకాడుతున్నట్టు తెలుస్తోంది.
జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న విజయ్.. ఎప్పటికప్పుడు కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. పార్టీ జనరల్ సెక్రెటరీ బుసి ఆనంద్ తో ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తున్నారు. ఆనంద్ కూడా ప్రభుత్వ తీరును తప్పుపడుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణలో ఉంది. కేసు విచారణలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆనంద్ భావిస్తున్నారు. అంతేకాదు కింది స్థాయి కార్యకర్తలు ధైర్యం కోల్పోకుండా ఉండడానికి ఆయన ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతున్నారు. పార్టీ పరంగా కరూర్ మృతులకు, క్షతగాత్రులకు పరిహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. కొంతమంది క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి ఆనంద్ చొరవ తీసుకుంటున్నారు. కింది స్థాయి కార్యకర్తలను డీఎంకే పార్టీ ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో.. వారికోసం ఆనంద్ సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నారు.