ICC T20: ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ సంరంభం మొదలైంది. క్వాలిఫైయర్ మ్యాచ్ లు జరుగుతుండగా..23 నుంచి అసలు సిసలు ప్రపంచకప్ టోర్నీ మొదలు కానుంది. 24న భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ తో అసలు వేడి రాజుకుంటోంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ను గెలుచుకోవడానికి ప్రధానంగా మూడు టీంలు పోటీపడుతున్నాయి.

కరోనా అనంతరం జరుగుతున్న అతిపెద్ద క్రీడా పండుగ ఇదే. ఐసీసీ నిర్వహిస్తున్న ఈ టోర్నిని భారత్ ఆతిథ్యం ఇస్తోంది. కరోనా కారణంగా మన దేశంలో కాకుండా దుబాయ్, ఒమన్ వేదికగా నిర్వహిస్తోంది. 2019 వన్డేప్రపంచకప్ తర్వాత ఇదే పెద్ద టోర్నీ.
ఈ టీ20 టోర్నమెంట్ లో ప్రధానంగా మూడు జట్లు టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. అవే భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లు. ప్రపంచ టీ20 నంబర్ 1 ర్యాంకులో ఇంగ్లండ్ ఉండగా.. పాకిస్తాన్ గత పదేళ్లుగా ఆదేశంలో ఉగ్రకార్యకలాపాలతో తన మ్యాచ్ లన్నింటిని యూఏఈలోనే ఆడుతోంది. దీంతో ఈ పిచ్ లన్నీ పాకిస్తాన్ కు కొట్టిన పిండి. అందుకే ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. ఇటీవల న్యూజిలాండ్, ఇంగ్లండ్ లను పాకిస్తాన్ ఓడించింది.
ఇక ఐపీఎల్ యూఏఈలో నిర్వహించడంతో ఇక్కడ ఆడిన మన ఆటగాళ్లు పిచ్ లకు అలవాటు పడ్డారు. ప్రస్తుతం జోరుమీదనున్నారు. ఇటీవల వార్మప్ మ్యాచ్ లలో బలమైన నంబర్ 1 ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలను చిత్తుగా ఓడించి సత్తా చాటారు.
ఇక ప్రపంచ పొట్టి క్రికెట్ లో ఇంగ్లండ్ జట్టు భీకరంగా ఉంది. అదే ప్రపంచంలో నంబర్ 1 టీ20 జట్టు. 8 సిరీస్ లలో ఆడితే వాళ్లు 7 గెలిచేశారు. కేవలం భారత్ లో మాత్రమే ఓడిపోయారు. అయితే స్టోక్స్, ఆర్చర్ లాంటి సీనియర్లు లేకపోవడం ఇంగ్లండ్ కు దెబ్బ.. కెప్టెన్ మోర్గాన్ ఫాంలో లేడు.
ప్రస్తుతం ధోని మెంటర్ గా ఉన్న టీమిండియా వ్యూహాల్లో ఆరితేరుతోంది. అతడి సలహాలు, సూచనలతో టీం పటిష్టంగా రూపుదిద్దుకుంటోంది. టీంను కూడా అతడే ఎంపిక చేస్తాడని బలంగా నిలబెట్టి పాకిస్తాన్ తో మ్యాచ్ కు తీర్చిదిద్దుతాడని అంటున్నారు.
-పాకిస్తాన్ తో ఆడే టీ20 భారత జట్టు ఇదే(అంచనా)
కోహ్లీ (కెప్టెన్), రోహిత్, రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, రవీంద్రజడేజా, శార్ధుల్ ఠాకూర్/భువనేశ్వర్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి/అశ్విన్.