T20 World Cup 2024: ఐపీఎల్ జోరుగా సాగుతోంది.. జట్లన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. అభిమానులకు అసలు సిసలైన క్రీడా వినోదాన్ని అందిస్తున్నాయి. సాయంత్రమైతే చాలు చాలామంది టీవీలకు అతుక్కుపోతున్నారు. మరికొందరు సెల్ ఫోన్ లోనే తల దూర్చుతున్నారు. ఫలితంగా అటు జియో సినిమా, ఇటు స్టార్ స్పోర్ట్స్ పండగ చేసుకుంటున్నాయి. టిఆర్పి రేటింగ్స్ లో సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. ఇది ఇలా ఉండగానే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ క్రికెట్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో మెగా టోర్నీ నిర్వహిస్తున్నామని.. క్రికెట్ మజా ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండాలని సంకేతాలు పంపింది. అంతేకాదు మైదానాలు కూడా సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించింది.
ప్రస్తుతం ఐపీఎల్ పూర్తయిన తర్వాత.. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా నిర్వహించే టీ -20 వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఐసీసీ ఇతర మెగా టోర్నీలు నిర్వహిస్తుంది. అవి ముగిసిన తర్వాత వరల్డ్ కప్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. 2027 అక్టోబర్, నవంబర్ నెలలో జింబాబ్వే, నమిబియా, దక్షిణాఫ్రికా వేదికలుగా ఐసీసీ వరల్డ్ కప్ నిర్వహించనుంది. సౌత్ ఆఫ్రికాలో ఐసీసీ గుర్తింపు పొందిన క్రీడా మైదానాలు 11 ఉన్నాయి.. అందులో 8 మైదానాలలో వరల్డ్ కప్ మ్యాచ్ లు ఐసీసీ నిర్వహించనుంది. వాండరర్స్, సెంచూరియన్ పార్క్, కింగ్స్ మీడ్, సెయింట్ జార్జ్ పార్క్, పార్ల్ అండ్ న్యూ లాండ్స్ లోని బోలాండ్ పార్క్, మాంగాంగ్ ఓవల్, బఫెలో పార్క్ లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. అయితే బెనోని, జేబీ మార్క్స్, ఓవల్, డైమండ్ ఓవర్ మైదానాల్లో వసతులు సక్రమంగా లేకపోవడంతో ఐసీసీ వాటిని పక్కన పెట్టింది. హోటళ్ళు, విమానాశ్రయాలను, సామర్థ్యం వంటి అంశాలు లెక్కలోకి తీసుకొని ఐసిసి ఈ ఎనిమిది వేదికలను ఎంపిక చేసింది. జింబాబ్వే, నమిబియా ప్రాంతాల్లో జరిగే పోటీల కోసం మైదానాలను ఐసీసీ త్వరలో ఎంపిక చేయనుంది.
2027 వరల్డ్ కప్ నిర్వహణ నేపథ్యంలో ఆతిధ్య దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే నేరుగా అర్హత సాధించాయి. నమిబియా ఆఫ్రికన్ క్వాలిఫైయర్ ను అధిగమిస్తే అర్హత పొందుతుంది. ఇక ఈ టోర్నీలో వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి 8 స్థానాల్లో ఉండే జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన నాలుగు స్థానాలు గ్లోబల్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ల ద్వారా ఐసీసీ నిర్ణయిస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. ఒక్కో గ్రూపులో ఏడు జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్ నుంచి మొదటి మూడు జట్లు సూపర్ దశకు చేరుకుంటాయి. అనంతరం సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లు జరుగుతాయి. 2003 వరల్డ్ కప్ తీరుగానే ఈ ప్రపంచ కప్ లోనూ రెండు గ్రూపుల్లో ఉన్న జట్లు ఒకదానితో మరొకటి కనపడే విధంగా ఐసీసీ కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.