ICC Champions Trophy ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమ్ ఇండియా ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ పై గెలుపును సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని తన ఖాతాలో వేసుకున్నది. ఫలితంగా 2013 తర్వాత టీమిండియా దాదాపు 12 సంవత్సరాలకు ట్రోఫీని సొంతం చేసుకుంది. వాస్తవానికి 2017లో టీమ్ ఇండియా ఫైనల్ వెళ్లి.. పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. దాయాది జట్టు చేతిలో ఓడిపోవడంతో భారత జట్టుపై విమర్శలు పెరిగిపోయాయి. చాంపియన్స్ ట్రోఫీలో పడిపోవడంతో టీమిండియా పాకిస్తాన్ జట్టుపై ఏకంగా మూడుసార్లు ప్రతీకారం తీర్చుకుంది. 2023 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో విజయం సాధించింది. 2024 t20 వరల్డ్ కప్ లో జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ గెలుపును సొంతం చేసుకుంది. 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్ లోనూ భారత్ పాకిస్తాన్ జట్టుపై విజయాన్ని నమోదు చేసింది. ఇలా మూడుసార్లు ప్రతీకారం తీర్చుకొని పాకిస్తాన్ జట్టుపై ఐసీసీ టోర్నీలలో తన పరాక్రమాన్ని టీమిండియా కొనసాగించింది.
మళ్ళీ మొదలుపెట్టారు
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని దుబాయ్ వేదికగా ఆడింది. పాకిస్తాన్ దేశంలో భద్రతా కారణాల వల్ల ఆడబోమని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో దుబాయ్ వేదికగా భారత్ మ్యాచ్ లు ఆడింది.. దుబాయ్ వేదికగా భారత్ మ్యాచ్లు ఆడినప్పటికీ.. వేర్వేరు పిచ్ లపై తల పడాల్సి వచ్చింది. దీంతో భారత్ ప్రతి మ్యాచ్ కు భిన్నమైన వ్యూహంతో ముందుకు వెళ్ళింది. దానికి తగ్గట్టుగా ఫలితాలను రాబట్టింది. అయితే దీనిపై ప్రత్యర్థి జట్ల మాజీ సీనియర్ ఆటగాళ్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దుబాయ్ వేదికను భారత్ తనకు అడ్వాంటేజ్ గా మార్చుకుందని మండిపడ్డారు. దీనిపై భారత మాజీ సీనియర్ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు మైదానంలో స్థిరంగా ఆడటం తెలుసుకుని ఉండాలని హితవు పలికారు. ఇక టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత.. పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు కొంతమంది శుభాకాంక్షలు తెలియజేయగా.. మరి కొంతమంది తమ అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో జునైద్ ఖాన్ అనే ఆటగాడు చేరాడు. ” న్యూజిలాండ్ 7,150 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. పాకిస్తాన్ చేరుకుంది. సౌత్ ఆఫ్రికా 3,286 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పాకిస్తాన్ చేరుకుంది. భారత్ మాత్రం ఒక కిలోమీటర్ దూరం కూడా ప్రయాణించకుండా ఛాంపియన్స్ ట్రోఫీ దక్కించుకుంది. కొన్ని జట్లు నైపుణ్యం వల్ల విజయం సాధిస్తాయి.. కొన్ని జట్టు మాత్రం ప్రయాణ షెడ్యూల్ వల్ల విజయం సాధిస్తాయి” అని జునైద్ ఖాన్ వ్యాఖ్యానించాడు. అయితే దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ” ముందు మీరు సొంత దేశంలో గెలవండి. కనీసం పోటీ అయినా ఇవ్వండి. అంతేతప్ప ఇలా గెలిచిన జట్ల మీద విమర్శలు చేయకండి. ఒకవేళ మీది గెలిచే జట్టు అయితే త్వరలో న్యూజిలాండ్ జట్టుతో జరిగే టి20 సిరీస్ కు పాకిస్తాన్ టీం లో అన్ని మార్పులు ఎందుకు చేశారు? బాబర్ అజామ్ ను ఎందుకు జట్టు నుంచి తొలగించారు? ” అంటూ టీమిండియా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. “నిన్నేమో అడ్వాంటేజ్ అని కూశారు.. ఇప్పుడేమో షెడ్యూలింగ్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఎవర్రా మీరంతా” అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.