Babar Azam: దాయాది దేశం పాకిస్థాన్.. ఆ దేశంలో మనకు దాదాపు ఏడు దశాబ్దాలకుపైగా వైరం కొనసాగుతోంది. పాకిస్థాన్ తన అభివృద్ధికంటే భారత పతనాన్నే ఎప్పుడూ కోరుకుంటోంది. ఇండియాపై విషం చిమ్ముతూనే ఉంటుంది. అయితే పాకిస్థానీల్లో కొంతమంది మంచివారు కూడా ఉన్నారు. భారత్‌పై తమ అభిమానం, ప్రేమ చూపుతారు. ఇటీవల అయితే కొన్ని రాష్ట్రాల ప్రజలే తమను భారత్‌లో కలపాలని కోరుతున్నారు. అక్కడి పరిస్థితులు అలా తయారయ్యాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజాం కూడా భారత్‌పై తన అభిమానం చాటుకున్నాడు. క్రీడాపరంగా విమర్శలు చేసినా, వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా భారత్ ఇచ్చిన ఆతిథ్యంపై ప్రశంసలు కురిపించారు.
ఊహించని రీతిలో..
వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ఆరు నెలల ముందే భారత్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్దం మొదలైంది. తాము భారత్‌కు రామంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది. తలస్థ వేదికలపై ఆడతామని తెలిపింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత్ పాకిస్థాన్‌కు వస్తే.. తాము వరల్డ్ కప్ ఆడేందుకు భారత్ వస్తామని కండీషన్ పెట్టింది. కానీ, అవన్నీ క్రమంగా సమసిపోయాయి. చివరకు వరల్డ్ కప్ ఆడేందుకు భారత్‌కు వచ్చింది. తమకు భారత్‌లో అపూర్వ స్వాగతం లభించిందని, ఆతిథ్యం అద్భుతంగా ఉందని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కొనియాడాడు. తాము తొలిసారి భారత్‌కి వచ్చినా.. త్వరగానే ఇక్కడి పరిస్థతులకు అలవాటు పడ్డామని తెలిపాడు. తనతోపాటు తన జట్టులోని ప్రతీ ఒక్కరికీ అభిమానుల నుంచి ప్రేమ, మద్దతు లభించాయన్నాడు. తమకు ఇలాంటి ఆదరణ దక్కుతుందని ఊహించలేకపోయామని పేర్కొన్నాడు.
మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదని..
అయితే వరల్డ్ కప్ టోర్నీలో తాము సరిగ్గా రాణించలేకపోయాయని, అందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు బాబర్. తాను బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోయానని ఒప్పుకున్నాడు. తనకు అర్ధశతకాలు, శతకాలు ముఖ్యం కాదని.. జట్టును గెలిపించడమే ముఖ్యమన్నాడు. తాను నెమ్మదిగా ఆడినా, వేగంగా ఆడినా.. అది పరిస్థితులకు అనుగుణంగానే ఉంటుందన్నాడు. మిడిల్ ఓవర్లతోపాటు చివర్లో తాము పరుగులు రాబట్టాల్సిందని చెప్పాడు. బంతి పాతబడిన తర్వాత పరుగులు చేయడం కష్టమవుతుందని, ఇలాంటి అనుభవాల్ని గతంలోనూ చవిచూశామని బాబర్ చెప్పుకొచ్చాడు.