MS Dhoni: ప్రపంచ క్రికెట్ లో మేధావి ఎవరంటే ఎంఎస్ ధోని పేరు చెబుతారు. అతడి క్రికెట్ ను చదివినట్టుగా ఎవరూ చదవలేదు. మాస్టర్ మైండ్ అని చెప్పు. అందుకే ఇండియా కరువు తీర్చేలా ప్రపంచకప్ వన్డే, టీ20 , టెస్ట్ చాంపియన్ షిప్ లను అతడి సారథ్యంలోనే టీమిండియా గెలుచుకుంది. టీమిండియా కెప్టెన్ గా.. వికెట్ కీపర్ గా ధోని వేసిన ప్రణాళికలు, ఆచరణలో పెట్టిన విధానం, కుర్రాళ్లను నడిపిన తత్వం చూస్తే ధోనిని ఎంత మెచ్చుకున్నా తక్కువే.

సీనియర్లు అంతా విఫలమైన వేళ ధోని కెప్టెన్సీలో యువకులతో వెళ్లిన టీమిండియా 2007లో ఏకంగా ప్రపంచకప్ టీ20 విజేతగా నిలిచింది. అప్పటి నుంచి మొదలైన అతడి మాయ 2016 వరకు సాగింది. ఈ క్రమంలోనే 2007 ప్రపంచ టీ20 కప్, వన్డే ప్రపంచకప్ 2011, చాంపియన్స్ ట్రోఫీ 2013 ధోని సారథ్యంలోనే టీమిండియాకు దక్కాయి. అంతకు మించిన అద్భుత విజయాలు అందించాడు.
వికెట్ల వెనుకాల ధోని ఒక మాస్టర్ మైండ్. అతడి సారథ్యంలోనే యువ స్పిన్నర్లు చాహల్, కులదీప్ యాదవ్ రాటుదేలారు. ధోని సలహాలతో బాగా రాణించారు. ధోని రిటైర్ అయ్యాక వీరు తేలిపోయారు. ధోని ఐడియాల వల్లే వారు బాగా రాణించారని స్వయంగా వాళ్లే చెప్పారు.
ఏ బౌలర్ ను ఎప్పుడు దించాలి? ఏ బౌలర్ ఎప్పుడు బరిలోకి దిగాలన్నది ధోనికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. 2007 ప్రపంచకప్ లో ముందు వచ్చి టీమిండియాకు కప్ అందించిన ఘనత ధోనిదే. 2021 ఐపీఎల్ ఫైనల్ లోనూ ముందొచ్చి ఇలానే కప్ ఇచ్చాడు. ఊహించని ఎత్తులు వేసి టీమిండియాను గెలిపించగలడు. ఎవరిని ఎలా వాడుకోవాలో ధోనికి తెలిసినంతగా వేరే ఎవరికి తెలియదు. అందుకే ధోనిని బీసీసీఐ మెంటర్ గా ఏరికోరి తీసుకొచ్చింది.
ధోని క్రికెట్ బుర్రను ఉపయోగించుకోవాలని బీసీసీఐ యోచించి కోహ్లీ, కోచ్ రవిశాస్త్రికి తోడుగా తీసుకొచ్చింది. తొలి మ్యాచ్ యే పాకిస్తాన్ తో.. సో ధోని బుర్ర ఎలా పనిచేస్తుంది? ఎలాంటి ప్రణాళికలు వేస్తుంది అనేది చూడాలి.