Sunrisers Hyderabad: ఐపీఎల్ 17వ సీజన్ ఉత్కంఠ సాగుతోంది. మొన్నటిదాకా టాప్ – 4 లో కొనసాగిన చెన్నై జట్టు ఒకసారిగా ఐదవ స్థానానికి పడిపోయింది. అంతకుముందు ఐదవ స్థానంలో ఉన్న లక్నో మూడవ స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్ జట్టు టేబుల్ టాపర్ రాజస్థాన్ పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి.. టాప్ -4 లో స్థానం దక్కించుకుంది.. ఇటీవల రెండు వరుస మ్యాచ్లలో హైదరాబాద్ ఓటమిపాలైంది. ఆ తర్వాత రాజస్థాన్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్లో విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ జట్టు.. ఆరు విజయాలు, నాలుగు ఓటములతో కొనసాగుతోంది . చెన్నై జట్టు కంటే ఒక స్థానం పైన నిలిచింది.
ఇటీవల ఆడిన మ్యాచ్లలో రెండు వరుస పరాజయాలను హైదరాబాద్ ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ జట్టుతో జరిగిన కీలకమైన మ్యాచ్లో విజయాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం పాయింట్లు పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నప్పటికీ.. హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరడం ఒకింత సందిగ్ధంగానే ఉంది. ఈ టోర్నీలో హైదరాబాద్ ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ నాలుగు మ్యాచ్లు కూడా వేరువేరు జట్లతో తలపడనుంది. పదో స్థానంలో ఉన్న ముంబై జట్టు, మూడవ స్థానంలో ఉన్న లక్నో, తొమ్మిదో స్థానంలో ఉన్న గుజరాత్, ఎనిమిదో స్థానంలో ఉన్న పంజాబ్ జట్లతో హైదరాబాద్ ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్లు గెలిస్తేనే హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలుస్తుంది. ప్లే ఆఫ్ కు దర్జాగా వెళుతుంది.
ప్రస్తుతం హైదరాబాద్ ఆరు విజయాలతో, ఖాతాలో 12 పాయింట్లు కలిగి ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిబంధనల ప్రకారం ప్లే ఆఫ్ లో అర్హత సాధించేందుకు ఒక జట్టు తక్కువలో తక్కువ 16 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండాలి. ఆ 16 పాయింట్లు సాధించాలంటే.. హైదరాబాదు వచ్చే నాలుగు మ్యాచ్లలో.. కనీసం రెండయినా గెలవాలి. అప్పటికి ప్లే ఆఫ్ చేరుకోవడం ఒకింత కష్టంగానే ఉంటుంది. ప్రస్తుతం ప్లే ఆఫ్ రేసు లో విపరీతమైన పోటీ ఉంది. బెంగళూరు లాగానే పంజాబ్ కూడా వరుస విజయాలు సాధిస్తే.. అప్పుడు ప్లే ఆఫ్ బెర్త్ మరింత రసవత్తరంగా మారుతుంది.
హైదరాబాద్ జట్టు మే 6 సోమవారం రోజున వాంఖడే వేదికగా ముంబై జట్టుతో తలపడుతుంది. మే 8 బుధవారం రోజున లక్నో జట్టుతో హైదరాబాద్ పోటీ పడుతుంది. మే 16న గురువారం గుజరాత్ జట్టును ఢీకొంటుంది. మే 19న ఆదివారం పంజాబ్ జట్టుతో చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ ప్లే ఆఫ్ వెళ్లాలంటే.. వరుసగా నాలుగు మ్యాచ్లు గెలవాలి. రెండు మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్ విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఒకవేళ మూడు మ్యాచ్లు గెలిస్తే, పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో నిలిచి దర్జాగా ప్లే ఆఫ్ కు వెళ్తుంది.