Champions Trophy 2025 (9)
Champions Trophy 2025: ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్ తర్వాత అతిపెద్ద టోర్నీ నిర్వహిస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియాతో అంతకుముందు ఇంగ్లాండ్ తో.. పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ లను విజయవంతంగా నిర్వహించింది. దీంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ లో నిర్వహించడానికి ఒప్పుకుంది. అయినప్పటికీ భారత్ మాత్రం పాకిస్థాన్ లో ఆడేందుకు ఒప్పుకోలేదు. రాజకీయ ఉద్రిక్తతల వల్ల పాకిస్థాన్లో ఆడేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో ఐసీసీ హైబ్రిడ్ మోడ్ ను తెరపైకి తెచ్చింది. ఫలితంగా భారత్ దుబాయ్ వేదికగా మ్యాచ్లు ఆడుతోంది. మరోవైపు కల్లోలమైన తమ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఘనంగా నిర్వహించి.. తమ సత్తా ఏమిటో చూపించాలని పాకిస్తాన్ భావిస్తున్నది.. టోర్నీ మొదలుకు ముందే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై తీవ్ర స్థాయిల విమర్శలు వచ్చాయి. ఐసీసీ విడుదల చేసిన నిధులతో కరాచీ, లాహోర్ మైదానాలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పునర్ నిర్మించింది. అయితే ఈ పనులు ఆలస్యమయ్యాయి. పైగా అందులో నాణ్యత పై విమర్శలు వ్యక్తమయ్యాయి. రచిన్ రవీంద్ర ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో తీవ్రంగా గాయపడ్డాడు. దానికి నాసిరకమైన ఫ్లడ్ లైట్లే కారణమని ఆరోపణలు వినిపించాయి. మన దేశ జాతీయ మీడియాలో దీనికి సంబంధించి కథనాలు ప్రసరమయ్యాయి. అయితే ఈ వ్యవహారం మరింత వివాదం కాకముందే ఐసీసీ, పిసిబి చర్యలు తీసుకున్నాయి. ట్రై సిరీస్ లోనే పరిస్థితి అలా ఉంటే.. టోర్నీ ఎలా సాగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.. ఒకవేళ ఇలాంటి పరిస్థితులే ఎదురైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు మరిన్ని ఇబ్బందులు తప్పవు.
సీట్లు కూడా….
ఐసీసీ విడుదల చేసిన నిధుల ద్వారా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పునర్ నిర్మించిన మైదానాలలో సీట్లు కూడా అధ్వానంగా ఉన్నాయని సోషల్ మీడియాలో అభిమానులు పోస్టుల రూపంలో తెలియజేస్తున్నారు. పైగా మైదానాలలో పెరిగిన గడ్డిని యంత్రాలతో కాకుండా.. మనుషులతో కోయించారని ఆరోపణలు వినిపించాయి. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అయినప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన తీరు మార్చుకోలేదు. అయితే ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న నేపథ్యంలో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి సౌకర్యాలను అటు ఆటగాళ్లకు.. ఇటు అభిమానులకు అందుబాటులోకి తెచ్చింది అనేది తెలియాల్సి ఉంది. కరాచీ మైదానంలో బుధవారం పాకిస్తాన్ – న్యూజిలాండ్ ( PAK vs NZ) తలపడుతున్న నేపథ్యంలో.. పీసీబీ ఏ మేరకు సౌకర్యాలు కల్పించింది అనేది బయటపడుతుంది. ఒకవేళ సౌకర్యాలు కల్పన విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విఫలమైతే.. జన్మలో ఆ దేశంలో ఐసీసీ మెగా టోర్నీ నిర్వహించడానికి ముందుకు రాదు. మరోవైపు 2008లో శ్రీలంక ఆటగాళ్లపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో.. పాకిస్తాన్ కరాచీ నేషనల్ స్టేడియంలో భారీగా భద్రతను ఏర్పాటు చేసింది. పోలీసుల బలగాలతో స్టేడియం మొత్తాన్ని తన అదుపులోకి తీసుకుంది.