Heinrich Klaasen: హెడ్ మీద భారీ అంచనాలు ఉండేవి. వాటిని అందుకోవడంలో అతడు విఫలమవుతున్నాడు. అభిషేక్ శర్మ మీద ఆశలు అమాంతం ఉండేవి. వాటిని సహకారం చేసుకోవడంలో అతడు కూడా ఇబ్బంది పడుతున్నాడు. హైదరాబాద్ జట్టు ఐపిఎల్ చరిత్రలో భారీ పరుగులు చేసిందంటే దానికి ప్రధాన కారణం వీరిద్దరే. అందువల్లే వీరిద్దరిని హైదరాబాద్ అభిమానులు కాటేరమ్మ కొడుకులు అని పిలుస్తుంటారు. 2024, 2025 సంవత్సరాలలో ఐపీఎల్లో వీరిద్దరు సృష్టించిన సంచలనం మామూలుది కాదు. అది పదాలకు అందదు. ఉపమానాలకు సరిపోదు.
2026లో మాత్రం వీరు అంతగా ఆకట్టుకోవడం లేదు. గొప్ప గొప్ప ఇన్నింగ్స్ లు ఆడటంలేదు. స్థూలంగా చెప్పాలంటే పంజాబ్ మీద మినహా.. మిగతా అన్ని జట్ల మీద వీరు తమ స్థాయి ఇన్నింగ్స్ ఆడలేదు. అందువల్లే మిగతా బ్యాటర్ల మీద ఒత్తిడి పడింది. హైదరాబాద్ జట్టు మూడు మ్యాచ్లలో ఓటమిపాలైందంటే దానికి ప్రధాన కారణం వీళ్లిద్దరే అని చెప్పవచ్చు. వీరిద్దరూ సరిగా ఆడలేక పోవడం.. బౌలింగ్ అంత గొప్పగా లేకపోవడంతో హైదరాబాద్ జట్టు ఓటములను కొని తెచ్చుకుంది.
అభిషేక్ శర్మ, హెడ్ విఫలమవుతున్నప్పటికీ.. క్లాసెన్ మాత్రం అదరగొడుతున్నాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచులలో వరుసగా 31 (22), 52 (35), 62 (41), 39 (33), 40(26), 59(39) పరుగులు చేశాడు. ఈ సీజన్లో హైయెస్ట్ రన్స్ చేసిన బ్యాటర్ల జాబితాలో ఇతడు ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు క్లాసెన్ 283 పరుగులు చేశాడు.
హైదరాబాద్ జట్టు వికెట్ కోల్పోయినప్పుడు ఆపద్బాంధవుడి లాగా నిలుస్తున్నాడు. జట్టుకు వెన్నెముకలాగా నిలబడుతున్నాడు. ప్రారంభంలో నిదానంగా ఆడుతున్న ఇతడు.. ఆ తర్వాత తన స్టైల్ చూపిస్తున్నాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తున్నాడు. ఇబ్బంది పెట్టే బంతులకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు. అందువల్లే ఇతడిని హైదరాబాద్ జట్టుకు వెన్నెముక అని పిలుస్తున్నారు. తన అనుభవాన్ని.. తన స్థిరత్వాన్ని జట్టుకు అందించడం ద్వారా.. అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు క్లాసెన్.
ఈ సీజన్ ప్రారంభానికి ముందు హెడ్ మీద.. అభిషేక్ శర్మ మీద హైదరాబాద్ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. విధ్వంసానికి సిసలైన అర్థం వచ్చే విధంగా వీరిద్దరూ ఆడతారని అనుకున్నారు. కానీ ఆట తీరు అభిమానులు అంచనా వేసినట్టుగా లేకపోవడంతో నిరాశపడుతున్నారు. కానీ వారందరికీ తన ఆట తీరు ద్వారా క్లాసెన్ సాంత్వన కలిగిస్తున్నాడు. ఎందుకంటే ఆవేశానికి అనుభవానికి చాలా తేడా ఉంటుందని నిరూపిస్తున్నాడు.