Hasan Mohammed : అనుకున్నట్టుగానే బంగ్లాదేశ్ ఆడుతోంది. భారత జట్టుకు ఊహించని పోటీని ఇస్తోంది. పాకిస్తాన్ ఇటీవల వారి స్వదేశంలో 2-0 తేడాతో మట్టి కరిపించిన బంగ్లాదేశ్.. అదే ఉత్సాహంతో భారత్ పై కూడా ఆడుతోంది. చెపాక్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత జట్టు పై పై చేయి సాధిస్తోంది. బంగ్లా బౌలర్ హసన్ మహమ్మద్ అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. అతడి దూకుడైన బౌలింగ్ వల్ల ఇప్పటికే ముగ్గురు భారత స్టార్ ఆటగాళ్లు ఔట్ అయ్యారు. మ్యాచ్ ప్రారంభమైన ఆరో ఓవర్ తొలి బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ (6) హసన్ బౌలింగ్ లో పెవిలియన్ చేరుకున్నాడు. భారీ షాట్ కొట్టడానికి రోహిత్ ప్రయత్నించగా..స్లిప్ లో ఉన్న షాంటో చేతికి చెప్పాడు. ఆ తర్వాత ఓవర్ లోనే గిల్ హసన్ బౌలింగ్ లో 0 పరుగులకు అవుట్ అయ్యాడు. లెగ్ సైడ్ వైపుగా వెళ్తున్న బాల్ ను గిల్ అనవసరంగా కొట్టాడు. దీంతో ఆ బంతిని వికెట్ కీపర్ దాస్ అమాంతం అందుకున్నాడు.. ఆ తర్వాత ఓవర్ లో కింగ్ కోహ్లీ (6) ని హసన్ అవుట్ చేశాడు. దీంతో భారత్ కష్టాల్లో కూరుకుపోయింది. బంతిని డైవ్ చేస్తూ బౌండరీకి తరలించేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. అయితే ఆ బంతి బ్యాట్ అవుట్ సైడ్ ఎడ్జ్ కు తగిలింది. నేరుగా వికెట్ కీపర్ దాస్ చేతుల్లోకి వెళ్ళింది..
17 సంవత్సరాల తర్వాత..
17 సంవత్సరాల అనంతరం టీమిండియా ముగ్గురు స్టార్ బ్యాటర్లు లేదా అంతకంటే ఎక్కువమంది ని తొలి ఇన్నింగ్స్ లో అది కూడా 10 ఓవర్లలోపు ఔట్ చేసిన బౌలర్ గా హసన్ మహమ్మద్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.. అతని కంటే ముందు శ్రీలంక బౌలర్ చనక వెల్గెదర 2009లో ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆ టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ వంటి మేటి ఆటగాళ్లను పది ఓవర్లలోపు అవుట్ చేశాడు. నాటి మ్యాచ్లో మూడు కీలక వికెట్లను వెంటవెంటనే కోల్పోవడంతో ధోని, ద్రావిడ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ శతకాలు చేయడంతో భారత్ – శ్రీలంక మ్యాచ్ డ్రా గా ముగిసింది. ప్రస్తుతం టీమిండియా చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఇబ్బంది పడుతోంది. ఇలాంటి సమయంలో ఆటగాళ్లు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పంత్, యశస్వి జైస్వాల్ క్రీజ్ లో ఉన్నారు. లంచ్ బ్రేక్ సమయానికి యశస్వి జైస్వాల్ (37), పంత్(33) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. వీరిద్దరు నాలుగో వికెట్ కు ఇప్పటివరకు 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మైదానాన్ని రెడ్ సాయిల్ తో రూపొందించినప్పటికీ అనూహ్యంగా బాల్ టర్న్ అవుతోంది. ఇది భారత ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ముగ్గురు ఆటగాళ్లు కూడా బంతి టర్న్ అవడం వల్లే అవుట్ అయ్యారు. యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ మాత్రం జాగ్రత్తగా ఆడుతున్నారు. బంగ్లా బౌలర్లను ప్రతిఘటిస్తున్నారు.