Gujarat Titans: 2022 సీజన్లో అందరి అంచనాలను గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు తలకిందులు చేసింది.. ఏకంగా విజేతగా ఆవిర్భవించింది. ఇక 2023 సీజన్లోనూ గుజరాత్ జట్టు అదరగొట్టింది. ఏకంగా ఫైనల్ దాకా వెళ్ళింది. ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఇచ్చింది. ఫైనల్ మ్యాచ్లో రవీంద్ర జడేజా దూకుడుగా ఆడకపోయి ఉండి ఉంటే.. కచ్చితంగా రెండవ సీజన్లోనూ గుజరాత్ జట్టు వరుసగా ఐపీఎల్ ట్రోఫీ గెలిచేది. ఆ సీజన్ తర్వాత గుజరాత్ జట్టుకు కెప్టెన్ గా శుభ్ మన్ గిల్(Shubh Man Gil) వచ్చాడు. గత సీజన్లోను గుజరాత్ జట్టు గొప్పగా ఆడలేదు గాని.. అలాగని చెత్త ఆట తీరు ప్రదర్శించలేదు. మొత్తంగా గత మూడు సీజన్ల ను పరిశీలిస్తే.. రెండుసార్లు ఫైనల్ వెళ్లిన జట్టుగా గుజరాత్ టైటాన్స్ రికార్డు సృష్టించింది.. ఐపీఎల్ లో అన్ని జట్ల యజమానులు మైదానాలలో సందడి చేస్తుంటారు. ఇక లక్నో జట్టు యజమాని అయితే మ్యాచ్ ఓడిపోతే చాలు.. కెప్టెన్ మీద, ఇతర ఆటగాళ్ల మీద తన ప్రతాపాన్ని చూపుతుంటాడు. కానీ గుజరాత్ టైటాన్స్ జట్టు యాజమాన్యం అలా కాదు.. వేలంలో ప్లేయర్లను కొనుగోలు చేశామా.. తర్వాత మన పని మనం చూసుకున్నామా అన్నట్టుగానే ఉంటుంది. గుజరాత్ జట్టు యాజమాన్యం గురించి ఇప్పటివరకు జనాలకు పెద్దగా తెలియదంటే.. వారు ఏ స్థాయిలో జీరో పబ్లిసిటీ కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. గుజరాత్ టైటాన్స్ జట్టును ఐపీఎల్ లో టొరంటో గ్రూప్, సి వి సి క్యాపిటల్స్ ప్రమోట్ చేస్తున్నాయి.. ఈ విషయం కూడా చాలామందికి పెద్దగా తెలియదు.
Also Read: 30 ఇన్నింగ్స్ ల తర్వాత వీరికి ఐపీఎల్ అర్థమైంది.. సీన్ కట్ చేస్తే దుమ్ము దుమారమే..
వరుస విజయాలతో..
ఈ సీజన్ గుజరాత్ జట్టు ఓటమితో మొదలుపెట్టింది. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఆ తర్వాత రాకెట్ వేగంతో తన విజయప్రస్థానాన్ని మొదలుపెట్టింది.ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 36 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలుపును దక్కించుకుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్లో 58 పరుగుల తేడాతో విజయం సాధించింది.. పై జట్లతో పోల్చి చూస్తే గుజరాత్లో పెద్దగా స్టార్ ఆటగాళ్లు లేరు.. ఆ జట్టు కూర్పును చూసినా ఐదు మ్యాచ్లు గెలిస్తే గొప్ప అనే భావన ఉంటుంది. కానీ మైదానంలో దిగితే వారు అంచనాలు తలకిందులు చేస్తారు. బట్లర్, రషీద్, గిల్, సిరాజ్ మినహా.. గొప్పగా స్టార్ ఆటగాళ్లు లేరు. ఆయనప్పటికీ రూథర్ఫోర్డ్, సాయి సుదర్శన్, రాహుల్ తేవాటియా, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, సాయి కిషోర్ వంటి బౌలర్లతో గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది.. ఆడిన ఐదు మ్యాచ్లలో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదే దూకుడు కనక గుజరాత్ కొనసాగిస్తే ప్లే ఆఫ్ వెళ్లడం పెద్ద కష్టం కాకపోవచ్చు. మరింతగా కష్టపడితే ట్రోఫీని రెండోసారి సొంతం చేసుకోవడం కూడా పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు.