Bumrah Champions Trophy 2025 : క్రికెట్‌లో వన్డే ప్రపంచకప్ టోర్నీ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి అంతటి ప్రాధాన్యం ఉంది. ఈ సిరీస్‌ను టెస్టు క్రికెట్ ఆడే జట్లు మాత్రమే ఆడతాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. ఇక భారత్ మ్యాచ్‌లు మాత్రం దుబాయ్ వేదికగా జరుగుతాయి. జనవరి 12 వరకు తుది జట్లు ప్రకటించాలని ఐసీసీ సూచించింది. అయితే భారత్ క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం మరో వారం గడువు కోరింది. ఎందుకంటే భారత స్పీడ్‌స్టార్ జస్‌ప్రిత్‌బుమ్రా గాయమే ఇందుకు కారణం. ఆస్ట్రేలియా టూర్‌లో బుమ్రా పాత గాయం తిరగబెట్టింది. ఆయనకు బెంగళూరులో చికిత్స చేస్తున్నారు. ఈ నెలలో జరిగే ఇంగ్లండ్ సిరీస్‌కు బుమ్రా(Jasprith Bmura)ను ఎంపిక చేయలేదు. మరోవైపు గాయంపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాడా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గుడ్‌న్యూస్?
ఇటు టీమిండియాలో, అటు అభిమానుల్లో బుమ్రా ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ(Champions trophy)కి బుమ్రా అందుబాటులోకి వస్తాడన్న సంకేతాలు వెలువడుతున్నాయి. పాత గాయానికి సంబంధించి చికిత్స జరుగుతున్న నేపథ్యంలో బుమ్రా వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. జనవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు బుమ్రా ఫిట్‌నెస్‌పై ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
ఫిబ్రవరి 19 నుంచి..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతుంది. టీమిండియా ఆడే మ్యాచ్‌లు అన్నీ దుబాయ్‌లో జరుగుతాయి. జనవరి 19న టీమిండియా జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో బుమ్రా ఎంపిక దాదాపు కాయమే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. బుమ్రా బెంగళూరులోని బీసీసీఐకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రిపోర్టు చేయాల్సి ఉంది.