WPL 2025: ఈ మ్యాచ్లో గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. హర్లిన్ డియోల్(32), కేశ్వి గౌతమ్ (20) పరుగులతో టాప్ స్కోరర్లు గా నిలిచారు. మిగతా బ్యాటరీ చేతులు ఎత్తేశారు. ముంబై బౌలర్లలో హీలి మాథ్యూస్ (3/16) మూడు వికెట్లు పడగొట్టింది. నాట్ సీవర్ బ్రంట్ (2/26), అమేలీయా కేర్(2/22) రెండేసి వికెట్లు సొంతం చేసుకున్నారు. షబ్నిమ్ ఇస్మాయిల్, అమన్ జీత్ కౌర్ తలా ఒక వికెట్ సొంతం చేసుకున్నారు. అనంతరం ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. 16.1 ఓవర్లలోనే ఐదు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. నాట్ సీవర్ బ్రంట్ (57) హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నది. అమేలీయ కేర్ (19) అదరగొట్టింది. గుజరాత్ బౌలర్లలో ప్రియా మిశ్రా, కేశ్వీ గౌతమ్ రెండేసి వికెట్లు తీశారు. కన్వర్ ఒక వికెట్ సొంతం చేసుకుంది.
దారుణంగా విఫలమయ్యారు
గుజరాత్ ప్లేయర్లు ముంబై బౌలర్ల ముందు చేతులెత్తేశారు. హర్లిన్ డియోల్(32), కేశ్వి గౌతమ్ (20) మాత్రమే పరవాలేదు అనిపించారు. వీరిద్దరు కూడా మిగతా ప్లేయర్ల మాదిరిగా చేతులెత్తేస్తే గుజరాత్ జట్టు స్కోరు 100 పరుగులు కూడా దాటలేకపోయేది. ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు కట్టుదిట్టంగా ఫీల్డింగ్ చేశారు. తద్వారా గుజరాత్ ఆటగాళ్లు పరుగులు చేయడం చాలా కష్టమైపోయింది. బెంగళూరు చేతిలో, ఇప్పుడు ముంబై చేతిలో వరుస ఓటములు ఎదుర్కోవడంతో గుజరాత్ జట్టు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గుజరాత్ జట్టు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో నిలవాలి అంటే తదుపరి మ్యాచ్లలో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బౌలింగ్ లోనూ..
బౌలింగ్ కు అనుకూలించే మైదానంపై గుజరాత్ బౌలర్లు తేలిపోయారు. వాస్తవానికి ఈ మైదానం పై 120 పరుగులు కాస్త టఫ్ స్కోర్. దానిని కాపాడుకోవడంలో గుజరాత్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ప్రియా మిశ్రా, కేశ్వీ గౌతమ్ మాత్రమే పరవాలేదు అనిపించారు. వీరిద్దరు మాత్రమే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వీరి బౌలింగ్లో ఆడేందుకు ముంబై బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే మిగతా బౌలర్లు కూడా వీరి మాదిరిగానే బౌలింగ్ వేసి ఉంటే గుజరాత్ పరిస్థితి మరో విధంగా ఉండేది. ఇక ఫీల్డింగ్ లోను గుజరాత్ ప్లేయర్ల నిర్లక్ష్యం కనిపించింది.. పది నుంచి పదిహేను పరుగుల వరకు ఫీల్డింగ్ నిర్లక్ష్యం వల్లే ముంబై జట్టుకు లభించాయి. అయితే తదుపరి మ్యాచ్లకు గుజరాత్ జట్టు లో సమూల మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వరుస ఓటములతో గుజరాత్ జట్టు డీలా పడిపోయింది. తదుపరి మ్యాచ్లో గుజరాత్ జట్టు పుంజుకోవాల్సిన అవసరం ఏర్పడింది.