Gautam Gambhir Shubman Gill Captaincy: క్రికెట్లో ఒకప్పుడు అంతర్గత విషయాలు అంతగా వెలుగులోకి వచ్చేవి కావు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అంతర్గత విషయాలను ఎంతగా నొక్కి పెట్టినప్పటికీ బయటికి వస్తూనే ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఆటగాళ్లు లేదా యాజమాన్యం ఆ విషయాలను బయటపెడుతోంది. తద్వారా అసలు నిజం వెలుగులోకి వస్తోంది. తాజాగా అలాంటిదే ఒకటి వెలుగులోకి వచ్చింది. అది కూడా టీమిండియా కు సంబంధించింది.
ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియా లో అనేక మార్పులు జరిగాయి. సారధిగా రోహిత్ శర్మను తప్పిస్తూ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. దీంతో అతడు టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరు లెజెండరీ ఆటగాళ్లు లేకపోవడంతో టీమిండియా ఒక మాదిరి జట్టుతోనే ఇంగ్లాండ్ గడ్డమీద అడుగుపెట్టింది. టీమిండియా కు పాతిక సంవత్సరాల గిల్ నాయకత్వం వహించాడు. ఆ సిరీస్ లో అతడు ఏకంగా 750+ పరుగులు చేశాడు. తన మీద వస్తున్న విమర్శలకు బ్యాట్ ద్వారా సమాధానం చెప్పాడు. ఇంగ్లాండ్ గడ్డమీద టీమిండియా కు సిరీస్ అందించలేకపోయినప్పటికీ… ఆతిథ్య జట్టుకు గర్వభంగాన్ని కలిగించాడు. ఒక రకంగా నాయకుడిగా అతడు గట్టిగా నిలబడ్డాడు. ఓవల్ టెస్టులో తనకు మాత్రమే సాధ్యమైన స్థాయిలో బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు. ఇవన్నీ కూడా గౌతమ్ గంభీర్ కు అమితమైన ఆనందాన్ని కలిగిస్తున్నాయి. దీనికి సంబంధించిన విషయాలనే గౌతమ్ గంభీర్ బయట పెట్టాడు. గిల్ ను కెప్టెన్ ఎందుకు చేయాల్సి వచ్చింది.. దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు జరిగాయి.. అనే విషయాలను పంచుకున్నాడు.
ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే తొలి టెస్ట్ లో విజయం సాధించింది. రెండో టెస్టులో కూడా గెలుపు దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఓ ప్రవేట్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను బయటపెట్టాడు . ” టీమిండియా కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా ఓడిపోవడం బాధ కలిగించింది. అది నా జీవితంలో ఒక మాయని మచ్చ లాంటిది. దాని నుంచి చాలా నేర్చుకోవాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని గిల్ తో అనేక సందర్భాల్లో చెప్పాను. నిన్ను లోతైన సముద్రంలోకి నెడుతున్నాం. ఈదుకొని ఒడ్డుకు వస్తే సంతోషం. అలా కాకుండా మునిగిపోతే ఇబ్బంది తప్పదు. పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా కు సారధి అవుతున్నావంటే మాటలు కాదు. ఎంత నేర్పరి తనాన్ని ప్రదర్శిస్తే అంత బాగుంటావని గిల్ తో చెప్పాను. ఓవల్ టెస్టులో అతడు చూపించిన పరిణతి గొప్పగా అనిపించింది. అతడు ఎన్ని సంవత్సరాలు సారధిగా ఉంటాడో చెప్పలేను గాని.. గొప్ప విజయాలు మాత్రం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నానని” గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.