Gamechanger Deepthi Jeevanji: ఆ అమ్మాయి పుట్టగానే అందంగా లేదు. పైగా రూపం కూడా చాలా విచిత్రంగా ఉంది.. ఇవన్నీ కూడా ఆ తల్లిదండ్రులకు ఇబ్బందిగా అనిపించినప్పటికీ.. తన బిడ్డ మీద మమకారంతో ఆ బాధను మొత్తం కడుపులో దాచుకొని.. ఆమెను పెంచారు. బంధువులు మాత్రం అడ్డగోలు మాటలు మాట్లాడారు. ఈమెను ఎందుకు పెంచుకుంటున్నారు.. ఏదైనా అనాధ శరణాలయంలో పడేయండి అంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. బంధువులు అలాంటి మాటలు మాట్లాడడంతో ఆ తల్లిదండ్రులు తీవ్రంగా కలత చెందేవారు.
అంతటి బాధను కూడా కడుపులో పెట్టుకొని ఆ అమ్మాయిని స్కూలుకు పంపించేవారు. స్కూల్ లో తోటి స్నేహితులు ఆమెను ఈసడించుకునేవారు. అడ్డగోలుగా మాట్లాడి.. ఆమెను ఇబ్బంది పెట్టేవారు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని తనకెంతో ఇష్టమైన అథ్లెటిక్స్ లోకి ప్రవేశించింది. అనేక కష్టాలు ఎదుర్కొని చివరికి దీపశిఖలా నిలబడింది. భారతదేశ గౌరవాన్ని ప్రపంచ వేదికల ముందు నిలబెట్టింది.. తద్వారా పుట్టిన గడ్డకు.. తల్లిదండ్రులకు అద్భుతమైన పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చింది.
ఆ అమ్మాయి మరెవరో కాదు.. ఉమ్మడి వరంగల్ జిల్లా కల్లెడ పర్వతగిరి కి చెందిన దీప్తి.. చిన్నప్పటినుంచి అనేక ఇబ్బందులు.. హేళనలు ఎదుర్కొని ఆమె ఈ స్థాయి వచ్చింది.. ఇటీవల జరిగిన పారా ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించింది. ఆమె సాధించిన విజయాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు నగదు బహుమతి ప్రకటించింది. ఇంకా అనేక పోటీలలో దీప్తి అద్భుతమైన ప్రతిభ చూపించింది. సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆమె ఆర్థిక స్థిరత్వాన్ని సాధించిన నేపథ్యంలో తనను కన్న తల్లిదండ్రులకు అద్భుతమైన కానుక ఇచ్చింది. పిల్లలు పుట్టగానే కాదు.. వాళ్లు ప్రయోజకులైనప్పుడే తల్లిదండ్రులకు నిజమైన సంతోషమని నిరూపించింది. తన తల్లిదండ్రులకు చిరకాల స్వప్నంగా ఉన్న సొంత ఇంటిని బహుమతిగా ఇచ్చింది. హన్మకొండ నగరంలో అత్యంత విలాసవంతమైన ఇంటిని నిర్మించి తల్లిదండ్రులకు అందించింది. తన కూతురు నిర్మించిన ఇల్లు చూసిన ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. పైగా ఆ ఇంటిని చూసి వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. వైకల్యంతో బాధపడుతూ.. జీవితంలో ఏదీ సాధించలేక వెనకడుగు వేసే దివ్యాంగులకు దీప్తి ఆదర్శంగా నిలుస్తోంది. జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే.. గట్టిగా నిలబడాలని చాటి చెబుతోంది.