Gambhir on Bengaluru Incident : టీమిండియాలో ఉన్నప్పుడు గౌతమ్ గంభీర్ ముక్కుసూటిగా వ్యవహరించేవాడు. అందువల్లే అతడు కెప్టెన్ కాలేకపోయాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికి.. కోచ్ గా కొత్త అవతారం ఎత్తినప్పటికీ.. అతడు తన ముక్కుసూటితనాన్ని వదులుకోలేదు. టీమిండియా గెలుస్తున్నా, ఓడిపోతున్నా.. తన మీద విపరీతమైన ఒత్తిడి ఉన్నా.. గౌతమ్ గంభీర్ తన స్టైల్ లోనే రెస్పాండ్ అవుతున్నాడు.. కీలక విషయాలపై మొహమాటం లేకుండా చెబుతున్నాడు. ఇక ఇటీవల టెస్ట్ జట్టును ఎంపిక చేసినప్పుడు.. అందులో అయ్యర్ కు చోటు కల్పించకపోయినప్పుడు.. ఇదే విషయాన్ని విలేకరులు ప్రస్తావించినప్పుడు.. గౌతమ్ గంభీర్ మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. “కోచ్ లు ఆటగాళ్లకు స్థానం లేదా స్థానం లేకుండా చేయరు” అంటూ స్పష్టం చేశాడు. అలాంటి గౌతమ్ గంభీర్ కర్ణాటక రాష్ట్ర రాజధానిలో చోటు చేసుకున్న దారుణంపై తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేసాడు.. ఏం జరుగుతుందో.. ఏం జరగాలో అనే విషయాలను కూడా పక్కన పెట్టి.. ఒక కోచ్ అనే సందర్భాన్ని దూరం పెట్టి.. ఒక మనిషిగా స్పందించాడు. మనిషిలాగా మాట్లాడాడు.
Also Read : పాపం పండింది.. ఆర్సీబీపై కేసు నమోదైంది..
” రోడ్డు షోలు, విక్టరీ పరేడ్ లు అవసరం లేదు. 2007లో భారత జట్టు విశ్వ విజేత అయినప్పుడు ఇలానే చెప్పాను. అభిమానులు భారీగా వస్తే పరిస్థితులు చేయి దాటిపోతాయి. అప్పుడు అనుకున్నప్పటికీ ఉపయోగం ఉండదు. కర్ణాటక రాజధానిలో జరిగిన ఘటన అత్యంత దారుణమైనది. అసలు ఇటువంటి సంఘటన జరగాలని ఎవరుూ కోరుకోరు. ఇంతటి విషాదం చోటు చేసుకోవడం బాధాకరం. అక్కడ దృశ్యాలను చూస్తుంటే హృదయం ద్రవించిపోతోంది. ఇటువంటి ఘటనలకు అందరూ బాధ్యత తీసుకోవాలి. భవిష్యత్తు కాలంలో ఇటువంటివి చోటు చేసుకోకుండా చూడాలి. ఇలాంటివి జరిగితే ప్రాణ నష్టం మాత్రమే కాదు.. తదుపరి జరిగే పరిణామాలు కూడా అత్యంత తీవ్రంగా ఉంటాయి. క్రికెటర్ల మీద అభిమానం తగ్గిపోతుంది. ఆటగాళ్ల మీద నమ్మకం పోతుంది. అది ఆటకు అసలు మంచిది కాదని” గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు..
2007లో పొట్టి ఫార్మాట్లో భారత జట్టు విశ్వవిజేతగా నిలిచినప్పుడు.. ధోని భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. 2007లోనే ఐసిసి పొట్టి ఫార్మాట్ ను అంతర్జాతీయ క్రికెట్ కు పరిచయం చేసింది. ఆ సమయంలో బీసీసీఐ భారీగా విజయ యాత్ర నిర్వహించాలని అనుకున్నది. కానీ భారీగా అభిమానులు వస్తే పరిస్థితి కట్టు తప్పుతుందని అందరూ అనుకున్నారు. నాడు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆటగాళ్లలో గౌతమ్ గంభీర్ కూడా ఉన్నాడు. అదే విషయాన్ని గౌతమ్ గంభీర్ గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించాడు. గత ఏడాది పొట్టి ఫార్మాట్ లో విశ్వవిజేతగా నిలిచినప్పుడు భారత మేనేజ్మెంట్ విజయ యాత్ర నిర్వహించింది. దేశ ఆర్థిక రాజధానిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు వచ్చారు. అంతటి భారీ కార్యక్రమం జరిగినప్పటికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మహారాష్ట్ర ప్రభుత్వం.. భారత క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. కానీ బెంగళూరు విషయంలో మాత్రం అన్నిట్లో వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఆ సంఘటనలు ఇంతటి దారుణాలకు కారణమయ్యాయి.