Yashasvi Jaiswal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెటర్లపై కాసులు వర్షం కురిపించే కామధేనువు. ఈ లీగ్ ద్వారా ప్రతి క్రికెటర్ కు కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది. ఆదాయాన్ని కల్పించే వనరుగానే కాకుండా యంగ్ క్రికెటర్లలోని ప్రతిభను వెలికి తీసే అద్భుతమైన వేదికగా కూడా ఐపిఎల్ నిలుస్తోంది. ఈ లీగ్ లో రాత్రికి రాత్రే హీరోలుగా మారిన ఎంతో మంది క్రికెటర్లు ఉన్నారు. అటువంటి యంగ్ అండ్ డైనమిక్ ప్లేయరే యశస్వి జైశ్వాల్. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈ క్రికెటర్ అద్భుతంగా రాణిస్తూ తన ప్రతిభను బయట ప్రపంచానికి తెలియజేస్తున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎంతో మంది యువ క్రికెటర్ల ప్రతిభ బయట ప్రపంచానికి తెలిసింది. మొన్నటికి మొన్న స్వీపర్ గా పని చేసిన రింకూ సింగ్.. అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఒక్కసారి హీరోగా మారిపోయాడు. తాజాగా మరో యంగ్ క్రికెటర్ ప్రతిభ బయటి ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఆ యంగ్ తరంగ్ పేరే యశస్వి జైశ్వాల్. ముంబై జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఈ యంగ్ ప్లేయర్ అదరగొట్టాడు. యశస్వి
124 పరుగులు చేయడంతో 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై జట్టు ముందు ఉంచింది రాజస్థాన్ జట్టు. 62 బంతుల్లో 16 ఫోర్లు ఎనిమిది సిక్సులు బాది 124 పరుగులు చేశాడు. బౌలర్ ఎవరైనా తన విధ్వంసానికి అడ్డు ఉండదని ఈ ఇన్నింగ్స్ తో చాటి చెప్పాడు ఈ క్రికెటర్.
పానీ పూరీలు అమ్ముకుంటూ క్రికెట్ ప్రాక్టీస్..
సెంచరీతో ఆధరగొట్టిన జైశ్వాల్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు. 11 ఏళ్ల వయసులో క్రికెట్ కోసం ముంబైకి వచ్చి మూడేళ్ల పాటు డేరా లో నివాసం ఉన్నాడు. పగటి పూట క్రికెట్ కోచింగ్ తీసుకుంటూ.. రాత్రి వేళల్లో ఖర్చులు కోసం పానీ పూరీలు అమ్ముకుంటూ జీవనాన్ని సాగించాడు. కొన్నేళ్లపాటు ఇదే విధమైన జీవనాన్ని అలవాటు చేసుకుని అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. 2020లో అండర్-19 వరల్డ్ కప్ లోను అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు యశస్వి జైశ్వాల్. అద్భుతమైన టెక్నిక్, అంతకంటే మించిన ప్రతిభ కలిగిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
నాలుగు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన రాజస్థాన్..
యశస్వి జైశ్వాల్ ను రాజస్థాన్ జట్టు నాలుగు కోట్ల రూపాయలకు 2020 లో కొనుగోలు చేసింది. ఐపిఎల్ లో ఇప్పటి వరకు 32 మ్యాచ్ లు ఆడిన ఈ లెఫ్ట్ హ్యండర్ బ్యాటర్ 30.47 యావరేజ్ తో 975 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇందులో తాజాగా ముంబై జట్టుతో చేసిన 124 పరుగులు అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇప్పటి వరకు 118 ఫోర్లు, 40 సిక్సులతో అదరగొట్టాడు ఈ యువ క్రికెటర్. ఇప్పటి వరకు నాలుగు సీజన్లు మాత్రమే ఆడిన ఈ యంగ్ క్రికెటర్.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఆడిన మొదటి ఐపిఎల్ 2020 లో మూడు మ్యాచ్ లు ఆడి 40 పరుగులు చేశాడు. 2021 లో 10 మ్యాచ్ ల్లో 249 పరుగులతో అదరగొట్టాడు. 2022 లో 10 మ్యాచ్ ల్లో 258 పరుగులు, 2023 సీజన్ లో ఇప్పటి వరకు 9 మ్యాచ్ లు ఆడి 428 పరుగులు చేసి టాప్ స్కోరర్ జాబితాలో ఉన్నాడు జైశ్వాల్.