French Open 2023 Final: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ పురుషుల టెన్నిస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం(జూన్ 11న) ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ద్వారా తన ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్ జమ చేసుకున్నాడు. తద్వారా ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన యోధుడిగా రికార్డులకెక్కాడు. ఇంతకవరకు నాదల్‌తో కలిసి 22 గ్రాండ్‌స్లామ్‌లతో సంయుక్తంగా ఉన్న జొకోవిచ్ తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ గెలవడంతో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ పురుషుల టెన్నిస్‌లో కొత్త రారాజుగా ఆవిర్భవించాడు.
ఆస్ట్రేలియాపైనే అత్యధిక టైటిళ్లు..
జొకోవిచ్ సాధించిన 23 గ్రాండ్‌స్లామ్స్‌లో అత్యధికంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ పది ఉండగా.. ఆ తర్వాత వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను ఏడుసార్లు గెలుచుకున్నాడు. ఇక యూస్ ఓపెన్‌తోపాటు ఫ్రెంచ్ ఓపెన్‌ను మూడేసి సార్లు నెగ్గిన జొకోవిచ్.. నాలుగు మేజర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ కనీసం మూడుసార్గు నెగ్గిన తొలి ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు.
ఏకపక్షంగా మ్యాచ్…
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆదివారం నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 7–6(7–1), 6–3, 7–5తో గెలుపొందాడు. మూడు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో తొలిసెట్‌లోనే జొకోవిచ్‌కు కాస్పర్ రూడ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. టైబ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను జొకోవిచ్ 7–1తో కైవసం చేసుకున్నాడు. ఇక రెండో సెట్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండానే కేవలం 45 నిమిషాల్లో 6–3తో సొంతం చేసుకున్నాడు. కీలకమైన మూడోసెట్‌లో కాస్పర్ రూడ్ ఫుంజుకోవడంతో మళ్లీ టైబ్రేక్ తప్పదనిపించింది. ఈ దశలో రూడ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ 7–5తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.
రికార్డులు ఇవీ..
– ఇక జొకోవిచ్ ఇప్పటి వరకు సాధించిన 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో పది గ్రాండ్‌స్లామ్‌లు 30 ఏళ్లలోపే సాధించడం గమనార్హం.
– రోలాండ్ గారోస్‌లో(ఫ్రెంచ్ ఓపెన్)లో ఛాంపియన్‌గా అవతరించిన అతిపెద్ద వయస్కుడిగానూ జొకో చరిత్ర సృష్టించాడు. 2023 ఫ్రెంచ్ ఓపెన్ కైవసం చేసుకునే నాటికి జొకో వయసు 36 ఏళ్ల 19 రోజులుగా ఉంది. ఈ నేపథ్యంలో రఫెల్ నాదల్(35 ఏళ్ల 11 నెలల 19 రోజులు) రికార్డును బద్దలు కొట్టాడు.
– ఇక ఓపెన్ శకంలో మహిళల, పురుషుల టెన్నిస్ విభాగాలను కలిపి చూస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన క్రీడాకారుల్లో సెరెనా విలియమ్స్‌తో కలిసి జొకోవిచ్(23 టైటిల్స్) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం మార్గరెట్ కోర్ట్ 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో తొలిస్థానంలో ఉంది. ఒకవేళ వచ్చే నెలలో ఆరంభం కానున్న వింబుల్డన్‌లో జొకోవిచ్ టైటిల్ కొడితే మార్గరెట్ కోర్ట్ సరసన నిలవనున్నాడు.