Fourth Ashes Test: ప్రఖ్యాతమైన బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లాండ్ జట్టును దురదృష్టం మరోసారి వెంటాడింది. ఈసారి ఇంగ్లాండ్ జట్టు బౌలర్లు అద్భుతమైన ప్రతిభ చూపించినప్పటికీ.. బ్యాటర్లు తేలిపోయారు. బౌలింగ్ కు సహకరించిన మైదానంపై ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. ఆస్ట్రేలియా జట్టును తొలి ఇన్నింగ్స్ లో 152 పరుగులకు ఆల్ అవుట్ చేశారు. టంగ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అట్కిన్సన్ రెండు వికెట్లు సాధించాడు. కెప్టెన్ స్టోక్స్, కార్స్ తలా ఒక వికెట్ సొంతం చేసుకున్నారు. ఆస్ట్రేలియా జట్టులో నేసర్ (39) టాప్ స్కోరర్ గా నిలిచాడు. కబాజ 29, క్యారీ 20 పరుగులు చేశారు. గ్రీన్ 17 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా జట్టు 152 పరుగులకు ఆల్ అవుట్ అయిన నేపథ్యంలో.. ఇంగ్లాండ్ బ్యాటర్లు కట్టుదిట్టంగా బ్యాటింగ్ చేయాల్సిన సందర్భంలో తేలిపోయారు. ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి 110 పరుగులకే ఆల్ ఔట్ అయ్యారు. ఇంగ్లాండ్ జట్టులో బ్రూక్ 41 పరుగులు చేశాడు. ఇతడు మాత్రమే ఆస్ట్రేలియా బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. బౌలర్ అటకిన్సన్ విలువైన 28 పరుగులు చేశాడు.. ఇక మిగతా వారంతా దారుణంగా తేలిపోయారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రూట్ 0 పరుగులకు అవుట్ అయ్యాడు. బెతల్ ఒక పరుగు మాత్రమే చేశాడు. డకెట్ రెండు పరుగులు మాత్రమే చేసి దారుణంగా నిరాశపరచాడు. వికెట్ కీపర్ స్మిత్ రెండు పరుగులు, విల్ జాక్స్ ఐదు పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నేసర్ నాలుగు టికెట్లు పడగొట్టాడు. స్టార్క్ రెండు వికెట్లు సాధించాడు. బోలాండ్ 3 వికెట్లు పడగొట్టాడు. గ్రీన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
ఆస్ట్రేలియా తక్కువ స్కోర్ చేసిన నేపథ్యంలో.. ఇంగ్లాండ్ బ్యాటర్లు అద్భుతంగా ఆకట్టుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా మైదానంలో వారు వ్యవహరించారు. ఏడు పరుగులకే ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగుల స్కోర్ వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 16 పరుగుల వద్ద నాలుగో వికెట్ నష్టపోయింది. ఈ దశలో బ్రూక్ ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోవడంతో మెరుగైన భాగస్వామ్యం లభించింది. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. 68 పరుగుల వద్ద ఇంగ్లాండ్ జట్టు 5, 6 వికెట్లను కోల్పోయింది. ఇక మిగతా నాలుగు వికెట్లను 42 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లాండ్ జట్టు కోల్పోయింది. మొత్తంగా ఇంగ్లాండ్ జట్టు 110 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కూడా కోల్పోకుండా నాలుగు పరుగులు చేసింది. బోలాండ్ (4), హెడ్(0) క్రీజ్ లో ఉన్నారు.