Four Wickets in Single Over : పాకిస్తాన్ యువ పేసర్ షాహిన్ అఫ్రిది అరుదైన రికార్డు నెలకొల్పాడు. గత కొన్నేళ్లుగా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న అఫ్రిది తాజాగా జరిగిన ఒక మ్యాచ్ లో తన పేరిట సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు షాహీన్ అఫ్రిది. టి20 బ్లాస్ట్ టోర్నీలో ఈ ఘనతను సాధించాడు.
పాకిస్తాన్ జట్టులో కీలక బౌలర్ గా షాహిన్ అఫ్రిది ఎదిగాడు. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా టి20 బ్లాస్ట్ లీగ్ లో ఆడుతున్న షాహిన్ అఫ్రిది తన మొదటి ఓవర్ లోనే నాలుగు వికెట్లు పడగొట్టి తొలి ఓవర్ లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా తన పేరిట సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు..
టి20 బ్లాస్ట్ లో భాగంగా వార్విక్ షైర్ తో జరిగిన మ్యాచ్ లో నాటింగ్ హమ్ జట్టు ఆటగాడు, పాకిస్తాన్ కు చెందిన పేసర్ షాహిన్ అఫ్రిది ఈ రికార్డును సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు గోల్డెన్ డకౌట్లు ఉండడం గమనార్హం. ఫలితంగా వార్విక్ షైర్ తొలి ఓవర్ లో 7 పరుగులకు నాలుగు వికెట్ల కోల్పోయింది. నాలుగు వికెట్లు తీసిన అఫ్రిది వైడ్ల రూపంలో ఐదు పరుగులు ఇవ్వడం గమనార్హం. మొదటి బంతికి వైడ్ రూపంలో ఐదు పరుగులు రాగా, రెండో బంతికి అలెక్స్ డేవిస్ (0) ఎల్బిడబ్ల్యుగా అవుట్ అయ్యాడు. రెండో బంతికి బెంజమిన్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడు, నాలుగు బంతులకు సింగిల్స్ రాగా, ఐదో బంతికి మౌస్లే (1) క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆఖరు బంతికి బర్నార్డ్ (0) బౌల్డ్ అయ్యాడు. ఈ విధంగా ఒకే ఓవర్లో ఇద్దరిని క్లీన్ బౌల్డ్ చేయడంతో పాటు నాలుగు వికెట్లు పడగొట్టి టి20 ల్లో తొలి ఓవర్ లోనే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. 2003 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో చమిందా వాస్.. తొలి ఓవర్ లో హ్యాట్రిక్ తోపాటు నాలుగు వికెట్లను తీసి శ్రీలంక ఫేస్ దిగ్గజం చమిందా వాస్ ఈ ఘనతను సాధించాడు. అయితే, టి20లో ఈ ఘనతను తొలిసారిగా అఫ్రిది దక్కించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగ్ హమ్ నిర్ణీత ఓవర్లలో 168 పరుగులు చేసింది. ఈ జట్టు ఇన్నింగ్స్ లో టామ్ మూర్స్ (73) అత్యధిక పరుగులు చేశాడు. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వార్విక్ షైర్ అఫ్రిది ఓవర్ లోనే నాలుగు వికెట్లతో దెబ్బ తీసినప్పటికీ అనూహ్యంగా పుంజుకొని మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. రాబర్ట్ ఎట్స్ (65), జేకబ్ బేతెల్ (27), జేక్ లింటాట్ (27) రాణించారు. నాటింగ్ హమ్ బౌలర్లలో అఫ్రిది నాలుగు, జేక్ బాల్ మూడు వికెట్లు తీసినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.