Cricketer Praveen Kumar Accident: టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాద సమయంలో ప్రవీణ్ కుమార్ తోపాటు అతని కుమారుడు కూడా కారులో ఉన్నాడు. మంగళవారం రాత్రి ఉత్తర ప్రదేశ్ లోని పాండవ్ నగర్ నుంచి మీరట్ కు ప్రవీణ్ కుమార్ తన ల్యాండ్ రోవర్ కార్లో ప్రయాణిస్తున్నారు. మీరట్ లోని కమిషనర్ బంగ్లా వద్ద ఓ ట్రక్కు ప్రవీణ్ కారును బలంగా ఢీ కొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయింది. అదృష్టవశాత్తు కారులోని ఎయిర్ బెలూన్సు సకాలంలో తెరుచుకోవడంతో ప్రవీణ్ కుమార్, అతని కొడుకు క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉంటే గత ఏడాది టీమిండియా స్టార్ బ్యాటర్ రషబ్ పంత్ కూడా ప్రమాదం బారిన పడ్డాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ ప్రస్తుతం మెల్లగా కోలుకుంటున్నాడు. అయితే, ఆ ప్రమాదాన్ని భారత క్రికెట్ అభిమానులు ఇంకా మర్చిపోకముందే ప్రవీణ్ కుమార్ కారు ప్రమాదానికి గురికావడం గమనార్హం. అయితే, అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడటంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
క్రికెట్ నుంచి తప్పుకున్నాక మీరట్ లోని ముల్తాన్ నగర్ లో ఉంటున్న ప్రవీణ్ కుమార్.. వ్యక్తిగత పనిమీద ఈ కారులో ప్రయాణం చేస్తున్న సమయంలో భారీ లోడుతో వస్తున్న ఒక ట్రక్కు మూల మలుపు ఉన్న ప్రాంతంలో ప్రవీణ్ కుమార్ కారును ఢీ కొట్టింది. స్థానికులు త్వరగా స్పందించి ప్రవీణ్ కుమార్ తోపాటు అతని కొడుకును స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ట్రక్కు డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. కారు పూర్తిగా డ్యామేజి అయినప్పటికీ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్లు ఈ మాజీ పేసర్ కుటుంబ సభ్యులు తెలిపారు. భారత జట్టుతోపాటు ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ప్రవీణ్ కుమార్ ఆడిన విషయం తెలిసిందే.