Shardul Thakur: ఆ ఆటగాడు ఆల్ రౌండర్ కాదు.. అరకొర ఆటగాడు మాత్రమే..!

2019లో టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Written By: BS, Updated On : May 15, 2023 4:16 pm

Shardul Thakur

Follow us on

Shardul Thakur: ఇండియన్ క్రికెట్ లో ఇటు బాల్, అటు బ్యాట్ తో రాణించే ఆటగాళ్లు అతికొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఈ మధ్యకాలంలో శార్దూల్ ఠాకూర్ బ్యాట్, బాల్ తో అదరగొడుతూ సత్తా చాటుతున్నాడు. వరుస మ్యాచ్ ల్లో అదరగొట్టడంతో ఆల్ రౌండర్ జాబితాలో చేరిపోయాడు ఈ ఆటగాడు. అయితే, ఐపీఎల్ తాజా ఎడిషన్ లో మాత్రం తన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. దీంతో అన్ని వైపుల నుంచి శార్దూల్ ఠాకూర్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఏడాది ఐపీఎల్ లో కోల్ కతా జట్టుకు ఆడుతున్నాడు టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్. ఇప్పటి వరకు ఈ సీజన్ లో పెద్దగా రాణించలేకపోయాడు ఈ ఆటగాడు. ఒకటి.. రెండు మ్యాచ్ లు మినహా ఆకట్టుకునే ప్రదర్శన ఏది రాలేదు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్ లో 110 పరుగులు చేశాడు ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్. బౌలర్ గాను స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. కేకేఆర్ తన కోసం రూ.10.75 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించినప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో మూడు ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసి పర్వాలేదనిపించాడు శార్ధుల్ ఠాకూర్.

అరకొర ఆటగాడు అంటూ విమర్శలు..

శార్దూల్ ఠాకూర్ ఈ ఏడాది ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వకపోవడంతో అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో నితీష్ రానా, రింకూ సింగ్ అర్థ శతకాలతో కదం తొక్కి 18.3 ఓవర్లలోనే విజయం అందించడంతో శార్దూల్ ఠాకూర్ కి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్, కామెంటేటర్ స్కాట్ స్తైరీస్ శార్దూల్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చెపాక్ వేదికగా ఆదివారం నాటి చెన్నై సూపర్ కింగ్స్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ఆరంభానికి ముందు జియో సినిమా షో లో స్టైరిస్ మాట్లాడుతూ.. శార్దూల్ ఠాకూర్ అసలు ఒక క్రికెటర్ లాగే అనిపించడం లేదు. అతడిని ఆల్ రౌండర్ అనడం కంటే ఆడ కూడా ఆటగాడు అని పిలవడం మేలు’ అంటూ అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను సగం.. సగమే అన్న అర్థం లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

గతంలోనూ ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు..

2019లో టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు జడ్డు సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇక ఆసియా కప్ -2022 సందర్భంగా వీరి మధ్య మాటలు కలిశాయి. ఇప్పుడు స్కాట్ స్టైరిస్ టీమిండియా ఫేస్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, ప్రస్తుత ఐపీఎల్ 2023తో బిజీగా ఉన్నా శార్దూల్ తదుపరి డబ్ల్యూటీసి ఫైనల్ కు సన్నద్ధమవుతున్నాడు. జూన్ 9 నుంచి ఆస్ట్రేలియా తో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఈ మెగా ఫైట్ కు ఎంపిక చేసిన భారత జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. తాజాగా, స్టైరిస్ చేసిన వ్యాఖ్యలు పట్ల శార్దూల్ ఠాకూర్ ఏ విధంగా స్పందిస్తాడో అన్నది వేచి చూడాల్సి ఉంది.