MSK Prasad Open Heart With RK: టీవీ9 రాయుడిని తీసుకొస్తే.. ఏబీఎన్ ఎమ్మెస్కే ను దింపింది

ప్రతి ఆదివారం తన చానల్లో సమాజంలో విభిన్నమైన వ్యక్తులను ఇంటర్వ్యూ చేసే రాధాకృష్ణ.. ఈసారి ఎమ్మెస్ కే ప్రసాద్ ను పిలిచాడు. వాస్తవానికి ప్రసాద్ ఎప్పుడో రావాల్సి ఉన్నప్పటికీ..

Written By: Bhaskar, Updated On : June 17, 2023 12:01 pm

MSK Prasad Open Heart With RK

Follow us on

MSK Prasad Open Heart With RK: “నాలో అపరిమితమైన ఆట ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడే సామర్థ్యం ఉంది. అందుకే నేను అంత ఈజీగా పరుగులు సాధించగలిగాను. నా దురదృష్టం ఏంటంటే నా ఆట తీరు బాగున్నప్పటికీ, నన్ను సెలెక్టర్లు తొక్కేశారు. నాలుగు జట్లకు ఆడినప్పటికీ పట్టించుకోవడం మానేశారు. అందువల్లే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పాల్సి వచ్చింది.. ఇప్పుడిక సెకండ్ ఇన్నింగ్స్ ఆడబోతున్నాను. అది ఎప్పుడు, ఎలాగో మీకు చెబుతాను” ఇదీ మొన్న టీవీ9 ఇంటర్వ్యూలో భారత మాజీ క్రికెటర్, తెలుగు బిడ్డ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు. అంతేకాదు అతడు ఐపిఎల్ గెలిచిన తర్వాత నేరుగా ట్రోఫీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద పెట్టాడు. ఆయనతో చాలా విషయాలు మాట్లాడాడు. సతీ సమేతంగా ఆయనకు శాలువా కప్పాడు. చాలామందికి చూస్తే ఇది రొటీన్ ప్రోగ్రాం లాగానే కనిపించవచ్చు. కానీ దీని అంతరార్థం వేరే ఉంది. బయటికి వస్తున్న సమాచారం ఏంటంటే అంబటి రాయుడు త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నాడని.. అది కూడా జగన్ మోహన్ రెడ్డి పార్టీ ద్వారా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయబోతున్నాడని.. అంబటి రాయుడిని కూడా స్టార్ క్యాంపెనర్ గా వాడుకోవాలని జగన్ చూస్తున్నాడు. ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతున్నది. ఇక, అసలే ఏపీలో టిడిపికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎలాగైనా రాయుడిని సైడ్ కార్నర్ చేయాలనే బాధ్యతను ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తీసుకున్నాడు.

ఎమ్మెస్కే ప్రసాద్ తో ఇంటర్వ్యూ

ప్రతి ఆదివారం తన చానల్లో సమాజంలో విభిన్నమైన వ్యక్తులను ఇంటర్వ్యూ చేసే రాధాకృష్ణ.. ఈసారి ఎమ్మెస్ కే ప్రసాద్ ను పిలిచాడు. వాస్తవానికి ప్రసాద్ ఎప్పుడో రావాల్సి ఉన్నప్పటికీ.. అతడు బిజీగా ఉండటంవల్ల ఎప్పటికప్పుడు షెడ్యూల్ మారిపోతూ వస్తోంది. అయితే రాయుడిని టీవీ9 ఇంటర్వ్యూ చేసిన నేపథ్యంలో ప్రసాద్ కు రాధాకృష్ణ షోకు తప్పింది కాదు.. ఈ సందర్భంగా రాధాకృష్ణ పలు ప్రశ్నలు అడిగాడు. వాటికి ఎటువంటి మొహమాటం లేకుండానే ప్రసాద్ సమాధానం చెప్పాడు..” జట్టులో సెలక్షన్ కమిటీకి ఒక పద్ధతులు ఉంటాయి. సెలక్షన్ చైర్మన్ కు ఎటువంటి ఆశ్రిత పక్షపాతం ఉండకూడదు. అలా ఉంటే అతడు దానికి పనికిరాడు. ఒకవేళ అంబటి రాయుడని సెలెక్ట్ చేయకుండా ఉండి ఉంటే అతడు జాతీయ జట్టులోకి ఎలా ఎంపిక అయ్యేవాడు? అతడిలో ఒక కుదురు గనుక ఉండి ఉంటే.. ఇన్ని జట్లు ఎందుకు మారుతాడు? ఇప్పుడు తనకు రాజకీయ అవసరం కావాలి కాబట్టి, జనాల్లో సింపతి కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. దానికి నన్ను బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదు” అని ఎమ్మెస్కే ప్రసాద్ కుండ బద్దలు కొట్టాడు.

2019 తప్పు నాది కాదు

ఇక 2019 వరల్డ్ కప్ లో టీమిండియా అవమానకరమైన రీతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. అప్పట్లో జట్టు కూర్పు పై చాలా విమర్శలు వచ్చాయి. 2019 వరల్డ్ కప్ టీం ను ఎం ఎస్ కే ప్రసాద్ ఆధ్వర్యంలో సెలెక్ట్ చేశారు. ఈ జాబితాలో కీలకమైన ఆటగాళ్ళను జట్టు విస్మరించడం, తెలుగువాడైన అంబటి రాయుడికి చోటు దక్కకపోవడంతో.. ఆ విషయాన్ని వేమూరి రాధాకృష్ణ ప్రధానంగా ప్రస్తావించారు.. దీనికి మొదట్లో తడబడిన ప్రసాద్.. తర్వాత సరైన సమాధానం ఇచ్చారు. జట్టును ఎంపిక చేసేటప్పుడు ఆటగాళ్ళ ఫిట్ నెస్, ట్రాక్ రికార్డు, గణాంకాలు, స్ట్రైక్ రేట్ అన్ని చూస్తాం. అలా చూసిన తర్వాత, సెషన్ లలో ఆట తీరును కూడా పరిశీలిస్తాం. అప్పుడే జట్టుకు ఎంపిక చేస్తాం. ఇందులో ఎవరికీ కూడా మినహాయింపు ఉండదు అని ప్రసాద్ స్పష్టం చేశారు.. ఇక ఈ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అయితే రాధాకృష్ణకు చంద్రబాబు అనుకూలమైన ప్రచారం కావాలి కాబట్టి.. అందులోకి ఎమ్మెస్కే ప్రసాద్ ను లాగాలని చూసాడు. కానీ ప్రసాద్ తెలివిగా ఆ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు అని స్పష్టం చేశాడు. అయితే మొన్న టీవీ9 అంబటి రాయుడిని ప్రొజెక్టు చేసేందుకు ఒక భారీ ఇంటర్వ్యూ నిర్వహించింది.. బొంబాట్ ప్రచారం చేసింది. దీనిని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేసింది. అంబటి రాయుడికి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో, ఒకవేళ వైసీపీ నుంచి పోటీ చేస్తే అది టిడిపికి ఇబ్బందిగా మారుతుందని భావించి రాధాకృష్ణ ఎం.ఎస్.కె ప్రసాద్ తో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షో నిర్వహించారు.. చంద్రబాబుకు మైలేజ్ తీసుకురావడానికి ఆర్కే ఈ ప్రయత్నం చేసినట్టు అర్థమవుతుంది. ప్రోమో ప్రకారం పలు వివాదాస్పద అంశాలను రాధాకృష్ణ గెలికే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. మరి వీటికి ప్రసాద్ ఏ విధమైన సమాధానాలు చెప్పాడో పూర్తి ఎపిసోడ్ చూస్తే గాని అర్థం కాదు.