చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని.. ఈ సీజన్ ముగిసిన తర్వాత రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. గత కొంత కాలంగా బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్నాడని, వయసు మీద పడుతున్న దృష్ట్యా ఇక ఆటకు వీడ్కోలు పలికితే బాగుంటుందని సూచించాడు. ఐపీఎల్-2020లో ఘోరంగా విఫలమైన చెన్నై… తాజా సీజన్ 2021లో మాత్రం అదరగొడుతోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

ఈ నేపథ్యంలో బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ ఎంఎస్ ధోని పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడనుకుంటున్నా. 40 ఏళ్ల ధోని అలసిపోతున్నాడేమో. ఏదేమైనా కెప్టెన్‌గా అతడు సాధించే విజయాలు ఇటు సీఎస్‌కేతో పాటు భారత క్రికెట్ మొత్తానికి కూడా ఉపయుక్తంగా ఉంటాయనడంలో సందేహం లేదు. జడేజా వంటి ఎంతో మంది ఆటగాళ్ల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చాడు. అయితే, వయసు మీద పడుతున్న కొద్దీ వ్యక్తిగతంగా రాణించలేకపోతున్నాడు అనిపిస్తోంది. రిటైర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి’అని వ్యాఖ్యానించాడు.
ధోని సీఎస్‌కే కు వీడ్కోలు పలికితే.. మేనేజ్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బ్రాడ్ అన్నాడు. ‘‘రాబోయే టీ20 వరల్డ్‌కప్‌నకు తను మెంటార్‌గా ఉండబోతున్నాడు. ఒకవేళ ఐపీఎల్‌లో ఆటకు గుడ్‌బై చెబితే సీఎస్‌కే హెడ్ కోచ్‌గా లేదంటే యాజమాన్యంలో కీలక సభ్యుడిగా మారే ఛాన్స్ ఉంది. స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో కలిసి వ్యూహాలు రచిస్తూ.. సరికొత్త సీఎస్‌కే ప్రయాణానికి బలమైన పునాదులు వేసేందుకు ఇది ఉపకరిస్తుంది’’ అని బ్రాడ్ చెప్పుకొచ్చాడు. ఒక వేళ ధోని గనుక రిటైర్ అయితే.. అతడి స్థానంలో ‘మ్యాచ్ ఫినిషర్’ రవీంద్ర జడేజా సీఎస్‌కే కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తవవుతున్నాయి.