David Warner test Cricket Retirement : ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో అత్యంత ప్రతిభ కలిగిన, దేశం కోసం అంకిత భావంతో ఆడే ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. అటువంటి వార్నర్ మరికొద్ది నెలల్లో టెస్ట్ కెరీర్ కు ముగింపు పలకనున్నాడు. 2024 జనవరిలో పాకిస్తాన్ తో జరిగే టెస్ట్ సిరీస్ తన కెరీర్ కు చివరిదని అతడు వెల్లడించాడు. ఈ ఆకస్మాత్తు నిర్ణయంతో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు డేవిడ్ వార్నర్. క్రికెట్ ఆస్ట్రేలియా పట్ల తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన వెంటనే రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆస్ట్రేలియా జట్టులో డాషింగ్ ఓపెనర్ గా పేరుగాంచిన డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే ఏడాది జనవరిలో పాకిస్తాన్ తో జరగనున్న టెస్టు సిరీస్ తనకు చివరిదని వార్నర్ ప్రకటించాడు. భారత్ – ఆసీస్ మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఈ నెల ఏడో తేదీన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వార్నర్ విలేకరులతో మాట్లాడుతూ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వచ్చే ఏడాది పాకిస్తాన్ తో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. పాకిస్తాన్ తో సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్టుతో టెస్ట్ సీరీస్ ఆడుతుంది. అయితే, ఆ సీరీస్ లో తాను ఆడబోనని వార్నర్ స్పష్టం చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ లో రాణించి యాషెస్ సిరీస్ జట్టులో చోటు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించాడు.
డబ్ల్యూటీసి ఫైనల్ కు ఆసీస్ ఎంపిక చేసిన జట్టులో వార్నర్ ఉన్న విషయం తెలిసిందే.
వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో వార్నర్..
టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటనపై భిన్నంగా స్పందించాడు.
ఇప్పట్లో వన్డేలకు రిటైర్మెంట్ ఉండదని వార్నర్ స్పష్టం చేశాడు. టెస్టులకు గుడ్ బాయ్ చెప్పడం ద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్ పై ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు వార్నర్ రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా స్పష్టం చేశాడు. 2024 ప్రపంచ కప్ ఆడాలనుకుంటున్నట్లు వార్నర్ వెల్లడించాడు. ఆ తరువాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తానని సూచనప్రాయంగా చెప్పాడు. ఆస్ట్రేలియా జట్టుకు వన్డే వరల్డ్ కప్ ఆడి కప్ అందించి తన రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఈ సందర్భంగా వార్నర్ ఆశా భావాన్ని వ్యక్తం చేశాడు.
ప్రాంచైజీ క్రికెట్ మాత్రం ఆడేందుకు మొగ్గు..
ప్రపంచ వ్యాప్తంగా ప్రాంచైజీ క్రికెట్ మాత్రం ఆడతానని ఈ సందర్భంగా వార్నర్ స్పష్టం చేశాడు. ఐపీఎల్ తోపాటు బిగ్ బాస్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వెల్లడించాడు. వీటితోపాటు ఇతర దేశాల్లో నిర్వహించే ప్రముఖ టోర్నీలో ఆడనున్నట్లు స్పష్టం చేశాడు. ఇక వార్నర్ టెస్ట్ కెరియర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 103 మ్యాచ్ లు ఆడి 45.57 సగటుతో 8,158 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డే, టి20లోనే కాకుండా టెస్టుల్లోనూ ధాటిగా బ్యాటింగ్ చేయగల సామర్ధ్యం వార్నర్ సొంతం. ఆస్ట్రేలియా జట్టులో సుదీర్ఘకాలం నుంచి క్రికెట్ ఆడుతున్న వార్నర్ ఇప్పటికీ అదే దూకుడుతో ఆడుతుండడం గమనార్హం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా వార్నర్ ను అభిమానించే అభిమానుల సంఖ్యలో లక్షల్లో ఉంది. తాజాగా డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.