Virat Kohli (1)
Virat Kohli: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions trophy 2025)లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్ (IND vs PAK) జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును మట్టి కరిపించింది.. భారత్ సాధించిన విజయంలో విరాట్ కోహ్లీ ముఖ్యపాత్ర పోషించాడు. సుదీర్ఘకాలం తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఫలితంగా భారత్ పాకిస్తాన్ జట్టుపై అన్ని రంగాలలో అధిపత్యాన్ని ప్రదర్శించింది. బౌలింగ్లో కులదీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు సాధించాడు. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ సాధించారు. టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకోవడం ఆ జట్టు పతనానికి ప్రధాన కారణమైంది. ప్లాట్ వికెట్ మీద పాకిస్తాన్ ఆటగాళ్లు పరుగులు తీయలేకపోయారు. షకీల్ (62), రిజ్వాన్(46) మినహా మిగతా ఆటగాళ్లు తేలిపోయారు. దీంతో పాకిస్తాన్ 241 పరుగులకే ఆల్ అవుట్ అయింది. భారత్ ఎదుట 242 రన్స్ టార్గెట్ విధించింది.
విరాట్ సూపర్ సెంచరీ
242 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన టీమిండియా ఏ దశలోనూ పాకిస్తాన్ బౌలర్ల ఎదుట తలవంచలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (20), గిల్ (46), విరాట్ కోహ్లీ (100), శ్రేయస్ అయ్యర్ (56) దూకుడుగా ఆడి.. పాకిస్తాన్ బౌలర్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత సెంచరీ చేయడంతో అతడి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ సెంచరీ ద్వారా తన కెరియర్లో 14వేల పరుగుల మైలురాయిని విరాట్ కోహ్లీ అందుకున్నాడు.. తద్వారా వన్డేలలో సచిన్, సంగక్కర తర్వాత ఆ స్థాయిలో పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మరోవైపు విరాట్ సెంచరీ చేయడంతో పాకిస్తాన్ లో అతని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. భారీ స్క్రీన్ ఏర్పాటుచేసి.. విరాట్ సెంచరీ చేసిన సందర్భాన్ని పండగ లాగా జరుపుకున్నారు. విరాట్ సెంచరీ చేయడం ఆలస్యం.. కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో సంచలనాలను సృష్టిస్తున్నాయి. ” విరాట్ కు ఎక్కడైనా ఫ్యాన్స్ ఉంటారు. చివరికి పాకిస్థాన్ లోనూ డై హార్డ్ కోర్ అభిమానులు ఉంటారు. దానికి నిదర్శనమే ఈ వీడియో.. ఎంతోమంది అభిమానులు అతడు సెంచరీ చేస్తే కేరింతల కొడుతున్నారు. ఇంతకు మించిన ఆనందం ఓ క్రికెటర్ కు ఏం ఉంటుంది.. అందుకే అతడు టీమిండియా రన్ మిషన్.. అతడు ఆడుతుంటే భారత్ అభిమానులే కాదు.. పాకిస్తాన్ దేశస్థులు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. అతడు సెంచరీ చేస్తే ఇలా ఎగిరి గంతులు వేస్తుంటారని” విరాట్ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
CELEBRATION IN PAKISTAN FOR VIRAT KOHLI’S HUNDRED. pic.twitter.com/WOkDj8d8nN
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025