India Vs Australia Odi Series: 2023లో స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరిగింది. ప్రారంభ మ్యాచ్ నుంచి సెమీఫైనల్ వరకు టీమిండియా వరుస విజయాలు సాధించింది. ఫైనల్ మ్యాచ్లో తీవ్ర ఒత్తిడికి గురై ఓటమిపాలైంది. టి20 వరల్డ్ కప్ గెలిచినా, ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకున్నా.. టీమిండియా కు వన్డే వరల్డ్ కప్ లేని లోటు మాత్రం తీరలేదు. ఇప్పటికీ ఆ ఓటమి గుర్తుకు వస్తే సగటు భారత అభిమాని ఆవేదన చెందుతాడు. అయితే ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ఇందులో భాగంగానే పటిష్టమైన జట్టును రూపొందించింది. గిల్ కు సారధ్య బాధ్యతలు అప్పగించింది.
2027 వన్డే వరల్డ్ కప్ కు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అప్పటిదాకా టీమిండియా 8 వన్డే సిరీస్ లు ఆడబోతోంది. ఇందులో ఐదు సిరీస్ లు స్వదేశంలో జరగబోతున్నాయి. మిగతా మూడు సిరీస్ లు విదేశాలలో జరుగుతాయి. ఆస్ట్రేలియాతో అక్టోబర్ 19 నుంచి నవంబర్ వరకు టీమిండియా 3 వన్డేల సిరీస్ ఆడబోతోంది. ఇది ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా తో స్వదేశంలో నవంబర్ నుంచి డిసెంబర్ దాకా 3 వన్డేల సిరీస్ ఆడుతుంది. ఇది పూర్తయిన తర్వాత న్యూజిలాండ్ జట్టుతో 2026 జనవరిలో 3 వన్డేల సిరీస్ ఆడుతుంది. ఇది పూర్తయిన తర్వాత జూన్ నెలలో ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ స్వదేశంలో జరుగుతుంది.
ఇదే ఏడాది జూలై నెలలో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు టీమిండియా ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లిపోతుంది. ఆ సిరీస్ పూర్తయిన తర్వాత మళ్లీ స్వదేశానికి వస్తుంది. వెస్టిండీస్ జట్టుతో సెప్టెంబర్, అక్టోబర్ నెలల కాలంలో 3 వన్డేల సిరీస్ ఆడుతుంది. అది పూర్తయిన తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ 3 వన్డేల సిరీస్ ఆడుతుంది. అది పూర్తయిన తర్వాత స్వదేశానికి వచ్చి శ్రీలంక జట్టుతో డిసెంబర్ నెలలో మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత 2027లో దక్షిణాఫ్రికా బయలుదేరి వెళ్లిపోతుంది. అక్కడ వన్డే వరల్డ్ కప్ లో ఆడుతుంది. వన్డే వరల్డ్ కప్ కంటే ముందు టీమిండియా దాదాపు 8 ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతుంది. ఇవన్నీ కూడా అత్యంత బలమైన జట్లే.. ముఖ్యంగా SENA(South Africa, England, New Zealand, Australia) జట్లతో సిరీస్ లు ఆడుతుండడం టీమిడియాకు కలిసి రానుంది. ఈ సిరీస్ లలో టీమ్ ఇండియా సత్తా చాటితే మాత్రం తిరుగు ఉండదు. పైగా 2003లో వన్డే వరల్డ్ కప్ జరిగినప్పుడు.. దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసింది. లీగ్ దశలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఫైనల్లో కూడా ఆస్ట్రేలియా చేతిలో భంగపాటుకు గురైంది. ఆ రెండు మినహా.. మిగతా అన్ని మ్యాచ్లలో టీమ్ ఇండియా గెలుపొందడం విశేషం.