England vs India : లార్డ్స్ ఓటమి తర్వాత టీమిండియా మెరుగుపడుతుందని.. ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవం మాత్రం వేరే విధంగా ఉంది. లార్డ్స్ ఓటమి నుంచి టీమిండియా పాఠాలు నేర్చుకోలేదు. పైగా అత్యంత నాసిరకమైన ఆట తీరు ప్రదర్శిస్తుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న బుమ్రా నాలుగో టెస్టులో అత్యంత దారుణంగా బౌలింగ్ వేశాడు. తన కెరియర్లో అత్యంత ఖరీదైన స్పెల్ వేశాడు. 33 ఓవర్లు వేసిన అతడు 110 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు మాత్రమే తీశాడు. అతడి బౌలింగ్ వైఫల్యం ఇంగ్లాండ్ జట్టుకు వరంగా మారింది. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 669 పరుగులు చేసింది. రూట్ 150, స్టోక్స్ 141 పరుగులు చేసి ఇంగ్లాండ్ జట్టుకు అత్యంత పటిష్టమైన పునాది వేశారు. వాస్తవానికి టీమ్ ఇండియా బౌలర్లు అత్యంత దారుణంగా బౌలింగ్ వేశారు.. రవీంద్ర జడేజా కు నాలుగు వికెట్లు దక్కినప్పటికీ.. అతడు ఏకంగా 143 పరుగులు ఇచ్చాడు. ఇన్నింగ్స్ లో గిల్ సేన 358 పరుగులకు కుప్పకూలగా.. ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 669 పరుగులు చేసింది.. తద్వారా తొలి ఇన్నింగ్స్ లో 312 పరుగుల లీడ్ సంపాదించింది.
ఇంగ్లాండ్ జట్టు ఆల్ అవుట్ అయిన తర్వాత రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా.. ఏ మాత్రం ఇంగ్లాండు జుట్టుకు పోటీ ఇచ్చేలాగా కనిపించలేదు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ సున్నా పరుగులకే వోక్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ సున్నా పరుగులకే వోక్స్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. వీరిద్దరు కూడా ఒకే రీతిలో అవుట్ కావడం విశేషం. అది కూడా జట్టు స్కోరు ఒక పరుగు కూడా నమోదు కాకుండానే ఇద్దరు బ్యాటర్లు అవుట్ కావడం గమనార్హం. వీరిద్దరూ తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. కానీ రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం దారుణంగా తేలిపోయారు.
ఈ పిచ్ పై టీమిండియా ప్లేయర్లు చేతులెత్తేశారు. బ్యాటింగ్లో వైఫల్యాన్ని కొనసాగించారు. ముఖ్యంగా కెప్టెన్ గిల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా అంతగా ఆకట్టుకోలేకపోయారు. బౌలింగ్ లోనూ బుమ్రా, సిరాజ్, అన్షుల్ కాంబోజ్ వంటివారు తేలిపోయారు. వాస్తవానికి వీరి బౌలింగ్ మీద టీం ఇండియా ఎంతో ఆశలు పెట్టుకుంది. వీరు ముగ్గురు తేలిపోవడం మాత్రమే కాదు.. దారుణంగా పరుగులు ఇవ్వడం ఇంగ్లాండ్ జట్టు పాలిట వరంగా మారింది. ఇంగ్లాండ్ జట్టులో ఏకంగా ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేయడం.. ఒక ఆటగాడు సెంచరీని వెంట్రుకవాసిలో కోల్పోవడం విశేషం. మన జట్టు బౌలర్లు వికెట్లు తీయడానికి… బ్యాటర్లు పరుగులు సాధించడానికి ఇబ్బందిపడిన వేళ.. ఇంగ్లాండ్ ఆటగాళ్లు మాత్రం ధారాళంగా పరుగులు తీశారు. స్వేచ్ఛగా వికెట్లు తీశారు. ముఖ్యంగా ఆర్చర్, వోక్స్ నిప్పులు చెరిగే విధంగా బంతులు వేస్తున్నారు. ఆ బంతులను ఎదుర్కోవడం టీమ్ ఇండియా బ్యాటర్ల వల్ల కావడం లేదు. ప్రస్తుతానికి టీం ఇండియా స్కోర్ ఒక పరుగు మాత్రమే కాగా.. కీలకమైన రెండు వికెట్లు కోల్పోవడం విశేషం.. ఇంగ్లాండ్ ఇప్పటికే 310 పరుగుల లీడ్ లో ఉంది. కనీసం ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవడానికైనా టీమిండియా పోరాడాలి. లేకపోతే ఆతిథ్య జట్టు నుంచి మరో దారుణమైన ఓటమి ఎదురు కావడం ఖాయం. ప్రస్తుతానికి క్రీజ్ లో కేఎల్ రాహుల్, గిల్ ఉన్నారు.. కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీకి దగ్గరగా వచ్చి అవుట్ అయ్యాడు. గిల్ అటు లార్డ్స్, ఇటు నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలమయ్యాడు. టీమిండియా ఓటమి తప్పించుకోవాలంటే.. వీరిద్దరూ ధాటిగా ఆడాలి.