England Vs Australia Ashes: ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు యాషెస్ (The Ashes) సిరీస్ గెలిచింది. వరుసగా మూడు టెస్టులలో విజయం సాధించింది. అయితే కీలకమైన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం ఓడిపోయింది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా గడ్డమీద టెస్టు విజయాన్ని అందుకుంది. బాక్సింగ్ డే టెస్టులో గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఐదవ టెస్ట్ కు అద్భుతమైన ప్లేయర్లకు తుది అవకాశం ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ మేనేజ్మెంట్ మరోసారి పనికిమాలిన నిర్ణయం తీసుకుంది. అది సిడ్ని వేదికగా జరుగుతున్న ఐదవ టెస్టులో ఇంగ్లాండ్ జట్టుకు ఆశనిపాతం లాగా మారింది.
సిడ్ని వేదికగా జరుగుతున్న ఐదవ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఓపెనర్ జాక్ క్రాలే(Zak Crawley) పూర్తిగా నిరాశ పరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. అయితే రూట్ (160), బ్రూక్(84), స్మిత్(46) పరుగులు చేశారు. తద్వారా ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 384 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ గట్టిగా ప్రారంభించింది. ఏకంగా 567 పరుగులు చేసింది. హెడ్ (163), స్మిత్ (138) సెంచరీలతో కదం తొక్కారు. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగుల లీడ్ సంపాదించింది.
183 పరుగుల వెనుకబాటుతో రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది ఇంగ్లాండ్ జట్టు. ఈ దశలో సమర్థవంతంగా బ్యాటింగ్ చేయాల్సిన ఇంగ్లాండు జట్టు.. మరోసారి తన వైఫల్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా ఓపెనర్ క్రాలే దారుణంగా విఫలమయ్యాడు. రెండు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసాడు. స్టార్క్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ జట్టు కుప్పకూలిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు.
ఈ దశలో బెన్ డకెట్ (40*), జాకోబ్ బెతల్ (28*) పరుగులు చేశారు. వీరిద్దరూ రెండో వికెట్ కు ఇప్పటివరకు 76 పరుగులు జోడించారు. ఈ స్టోరీ రాసే సమయం వరకు ఇంగ్లాండ్ జట్టు ఒక వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. ఇంకా 103 పరుగులు వెనుకబడి ఉంది. నాలుగు రోజు రెండు సెషన్ ల ఆట మిగిలి ఉంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి.. ఆస్ట్రేలియా అధిక్యాన్ని మరింత తగ్గించాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తోంది. మరోవైపు, ఆస్ట్రేలియా జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధించి.. మెల్బోర్న్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతోంది.