Eng Vs Aus Ashes 2025 Fourth Test: క్రికెట్ ఇంగ్లాండ్ లో పుట్టినప్పటికీ.. మనదేశంలో విపరీతమైన ఆదరణ ఉంటుంది. అయితే మనలాగా చించుకోరు గాని.. ఆస్ట్రేలియా అభిమానులు కూడా క్రికెట్ ను విపరీతంగా చూస్తారు. క్రికెటర్ల మీద విపరీతమైన ప్రేమను కనబరుస్తారు. ఆస్ట్రేలియా ప్రస్తుతం టెస్టులలో నెంబర్ వన్ ర్యాంక్ లో ఉంది. పైగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఆడిన ఏ టెస్ట్ సిరీస్ కూడా కోల్పోలేదు. తాజాగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న యాషెస్ సిరీస్ లో కూడా ఆస్ట్రేలియా విజయం సాధించింది. వరుసగా మూడు టెస్టులలో విజయం సాధించి, సరికొత్త రికార్డును సృష్టించింది.
ఇదే ఊపులో బాక్సింగ్ డే టెస్ట్ లో కూడా విజయం సాధించాలని ఆస్ట్రేలియా జట్టు గట్టి సంకల్పంతో మెల్బోర్న్ మైదానంలో అడుగు పెట్టింది. ఈసారి ఆస్ట్రేలియా జట్టుకు స్మిత్ నాయకత్వం వహించాడు. మూడో టెస్ట్ కు అతడు దూరమైనప్పటికీ.. నాలుగో టెస్ట్ కు అందుబాటులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా జట్టు భీకరమైన ఫామ్ లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా బాక్సింగ్ డే టెస్ట్ లో కూడా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని ఫలితం వచ్చింది. ప్రఖ్యాతమైన బాక్సింగ్ డే టెస్టు రెండుంటే రెండు రోజుల్లోనే పూర్తయింది. అది కూడా రెండవ రోజు మూడో సెషన్ లోనే ఫలితం వచ్చింది.
మెల్బోర్న్ మైదానంలో తొలి రోజు 20 వికెట్లు నేలకూలాయి. ఆ తర్వాత మరుసటి రోజైన శనివారం 16 వికెట్లు పడిపోయాయి. వాస్తవానికి ఈ మైదానాన్ని బౌలర్లు తనకు ప్యారడైజ్ లాగా మార్చుకున్నారు. కట్టుదిట్టమైన బంతులు వేసి బ్యాటర్లకు చుక్కలు చూపించారు. రెండు రోజుల్లోనే 36 వికెట్లు నేల కూలిన ఈ మైదానంలో.. ప్రేక్షకులు కూడా సరికొత్త రికార్డు సృష్టించారు. బాక్సింగ్ డే టెస్ట్ వీక్షించేందుకు ఏకంగా 94,199 మంది ప్రేక్షకులు వచ్చారు. 2015లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు ఈ మైదానానికి 93,013 ప్రేక్షకులు వచ్చారు. అయితే ఈసారి తమ రికార్డును తామే ప్రేక్షకులు బద్దలు కొట్టుకున్నారు. అంతకుమించి అన్నట్టుగా మైదానానికి భారీగా వచ్చారు. ప్రేక్షకుల రాకతో మెల్బోర్న్ మైదానం కిటకిటలాడిపోయింది. అయితే ఆస్ట్రేలియా అభిమానులు భారీగా వచ్చినప్పటికీ, తమ జట్టు ఓడిపోవడంతో నిరాశతో వెను తిరిగి వెళ్ళిపోయారు.