AUS Vs ENG 4th Ashes Test Highlights: యాషెస్ సిరీస్ కోల్పోయినప్పటికీ.. ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా గడ్డమీద ఆత్మగౌరవం కోసం పోరాడింది. ఈ పోరాటంలో ఇంగ్లాండ్ జట్టుకు స్వల్ప ఊరట లభించింది. తొలి టెస్ట్ నుంచి మొదలు పెడితే ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా కు గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ.. అది ఏమాత్రం సరిపోడం లేదు . మూడు టెస్టులలో వరుసగా ఓటములు ఎదుర్కొన్న తర్వాత.. ఇంగ్లాండ్ జట్టు మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. దీనికి తోడు ఇంగ్లాండ్ ప్లేయర్లు ప్రాక్టీస్ వదిలిపెట్టి మద్యం తాగారని ఆరోపణలు కూడా వినిపించాయి. ఇన్ని ఇబ్బందుల మధ్య బాక్సింగ్ డే టెస్ట్ ఆడేందుకు మెల్బోర్న్ మైదానంలో అడుగుపెట్టింది ఇంగ్లాండ్ జట్టు. అయితే ఈసారి ఆస్ట్రేలియా జట్టు ముందు తల వంచ లేదు. విజయమా? వీర స్వర్గమా? అనే చర్చ వచ్చినప్పుడు.. రెండవ దానికి జై కొట్టింది ఇంగ్లాండ్ జట్టు.
మెల్బోర్న్ మైదానంలో రెండు జట్ల బౌలర్లు పండగ చేసుకున్నారు. కేవలం రెండే రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగించారు. పెర్త్ టెస్ట్ మూడు రోజుల్లో ముగిస్తే.. ప్రఖ్యాతమైన మెల్బోర్న్ మైదానం లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ ను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ప్లేయర్లు రెండు రోజుల్లోనే పూర్తి చేశారు.
ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈసారి ఇంగ్లాండ్ బౌలర్లు జోరు చూపించడంతో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 152 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆస్ట్రేలియా జట్టులో నేజర్ 35 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జోష్ టంగ్ 5 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కేవలం 110 పరుగులకే ఆల్ అవుట్ అయింది. 41 పరుగులతో బ్రూక్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. నేజర్ నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. బోలాండ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇలా ఒక్కరోజే రెండు జట్ల బౌలర్లు 20 వికెట్లు పడగొట్టారు.
ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు 132 పరుగులకు ఆల్ అవుట్ అయింది. హెడ్ 46 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో కార్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. స్టోక్స్ మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా విధించిన 152 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించడానికి రంగంలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి.. గెలుపును సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో క్రాలే(37), డకెట్ (34), బెతెల్ (40) పరుగులు చేశారు. ఒకానొక దశలో ఇంగ్లాండ్ జట్టు 112/2 వద్ద ఉన్నప్పటికీ.. 43 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ ఆస్ట్రేలియా బౌలర్లను ప్రతిఘటించి విజయం సాధించింది. సిరీస్ కోల్పోయినప్పటికీ.. ప్రతిష్టాత్మకమైన బాక్సింగ్ డే టెస్ట్ లో విజయం సాధించి ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంది.