Eng Vs Aus Ashes 2025 Fourth Test: ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న యాషెస్ సిరీస్ లో మొత్తానికి ఇంగ్లాండ్ జట్టు మద్యం మత్తును వదిలించుకుంది. గడచిన మూడు టెస్టులలో దారుణంగా బౌలింగ్ వేసిన ఆ జట్టు బౌలర్లు.. ప్రఖ్యాతమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో శుక్రవారం మొదలైన బాక్సింగ్ డే టెస్ట్ లో సత్తా చూపించారు. ఈ సిరీస్ లో తొలిసారిగా తమ బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు..
పిచ్ పై తేమ అధికంగా ఉన్న నేపథ్యంలో ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నిర్ణయం సరైనదని ఇంగ్లాండ్ బౌలర్లు నిరూపించారు. భీకరమైన ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా ప్లేయర్లకు చుక్కలు చూపించారు.. ముఖ్యంగా ఈ సిరీస్లో పరుగుల వరద పారిస్తున్న హెడ్ తల పొగరును నేలకు దించారు ఇంగ్లాండ్ బౌలర్లు. 22 బంతుల్లో 12 పరుగులు చేసిన హెడ్.. అట్కిన్సన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు వికెట్ల పతనం నిరాటంకంగా సాగింది.. ఆస్ట్రేలియా బ్యాటర్లలో నేజర్ (35) టాప్ స్కోరర్ గా నిలిచాడు. వెదర్ లాడ్ (10), లబూషేన్(6), స్మిత్ (9), ఖవాజా(29), క్యారీ (20), గ్రీన్(17), స్టార్క్(1), బోలాండ్ (0) ఇలా ప్లేయర్లు మొత్తం పెవిలియన్ కు క్యూ కట్టారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో టంగ్ ఐదు వికెట్లు పడగొట్టారు. అట్కిన్సన్ రెండు వికెట్లు సాధించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్, కార్సే చెరొక వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు ఈ సదనం రాసే సమయం వరకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ క్రాలే(5), డకెట్ (2) విఫలమయ్యారు. పోప్ స్థానంలో వచ్చిన బెతల్ (1) నిరాశపరిచాడు. రూట్(0) డక్ ఔట్ అయ్యాడు. స్టార్క్, నేసర్ చెరి రెండు వికెట్లు సాధించారు.
బాక్సింగ్ డే టెస్ట్ కు ముందు ఇంగ్లాండ్ జట్టు తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంది. మూడో టెస్ట్ కు ముందు లభించిన విరామాన్ని ప్రాక్టీస్ కు ఉపయోగించుకోకుండా.. మద్యం తాగడానికి ప్లేయర్లు వాడుకున్నారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు విచారణకు కూడా ఆదేశించింది. చివరికి ఇంగ్లాండ్ కెప్టెన్ ను తప్పిస్తారని వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఒక్కసారిగా తన ఆట తీరు మార్చుకుంది.