ENG Vs AUS: యాషెస్ సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్ లో గురువారం (డిసెంబర్ 4 నుంచి) ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు డే అండ్ నైట్ టెస్ట్ లో తలపడుతున్నాయి. బ్రిస్బేన్ టెస్ట్ కు కూడా కమిన్స్, హేజిల్ వుడ్ దూరం కాబోతున్నారు. సిడ్నీలో నెట్స్ లో వారిద్దరు సాధన చేస్తూ కనిపించారు. ఐతే వారిద్దరు బ్రిస్బేన్ టెస్ట్ కు ఫిట్ గా ఉన్నారని ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ ప్రకటించలేదు.
బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా జట్టుకు సారథిగా స్మిత్ వ్యవహరించనున్నాడు. పెర్త్ టెస్ట్ లో మాదిరిగానే కమిన్స్ జట్టుతో ఉంటాడని ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ ప్రకటించింది. అక్కడే తన సన్నాహాలను కొనసాగిస్తాడని ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ వివరించింది. హేజిల్ వుడ్, కమిన్స్ లేకుండానే ఆస్ట్రేలియా జట్టు పెర్త్ టెస్టులో విజయం సాధించింది. మిచెల్ స్టార్క్ ఒక్కడే ఇంగ్లాండ్ జుట్టును కూల్చాడు. పదునైన బంతులు వేసి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ మొత్తాన్ని కకావికలం చేశాడు.
ఇంగ్లాండ్ జట్టు బ్రిస్బేన్ టెస్ట్ కు సిద్ధమవుతున్నప్పటికీ.. ఆ జట్టులో అంతర్గతంగా ఒక రకమైన భయం ఏర్పడింది. తొలి ఇన్నింగ్స్ లో 40 పరుగులు వెనుకబడి ఉన్న ఆస్ట్రేలియా.. రెండవ ఇన్నింగ్స్ నాటికి దూకుడు కొనసాగించింది. ఇంగ్లాండ్ జట్టు బౌలర్లను ఒక ఆట ఆడుకుంది. ముఖ్యంగా హెడ్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టెస్టులో టి20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. మెరుపు వేగంతో సెంచరీ చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఆస్ట్రేలియా జట్టులో ఉస్మాన్ ఖవాజా పెర్త్ టెస్ట్ సమయంలో వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఒకే ఒక పరుగు మాత్రమే చేసాడు. గాయం వల్ల రెండవ అతడు ఓపెనర్ గా రాలేదు. దీంతో హెడ్ అతడి స్థానంలో వచ్చాడు. 83 బంతులు ఎదుర్కొని 123 పరుగులు చేశాడు .
హెడ్ దూకుడు వల్ల ఆతిథ్య జట్టు 205 పరుగుల లక్ష్యాన్ని రెండవ రోజు ఒకే సెషన్ లో పూర్తి చేసింది. రెండో టెస్ట్ కు ఆస్ట్రేలియా జట్టు హెడ్ ను ఓపెనర్ గా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ఆరో స్థానంలో ఆల్రౌండర్ వెబ్ స్టర్ ను చేర్చుకుంటుందని తెలుస్తోంది.
బ్రిస్బెన్ టెస్ట్ కు ఆస్ట్రేలియా జట్టు అంచనా
స్మిత్(కెప్టెన్), బోలాండ్, అలెక్స్ క్యారీ, డగట్, గ్రీన్, హెడ్, ఖవాజా, జోస్ ఇంగ్లిస్, లబు షేన్, లియాన్, మైకెల్ నేజర్, స్టార్ట్, వెదర్ ల్యాండ్, వెబ్ స్టర్.