ICC women’s World Cup 2025: ఒకప్పుడు కిట్ లు కూడా సరిపడా ఉండేవి కాదు. విమానాలలో వెళ్ళడానికి సరైన డబ్బులు కూడా ఉండేవి కాదు. రైళ్లల్లో జనరల్ బోగీలలో ప్రయాణించేవారు. చివరికి ఒక టాయిలెట్ ను ఐదుగురు వినియోగించుకునేవారు. అటువంటి పరిస్థితుల నుంచి టీమిండియా ప్రస్తుతం ప్రపంచ విజేతగా ఎదిగింది. ఎన్నో అవమానాలను.. మరెన్నో ఇబ్బందులను ఎదుర్కొని ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది.. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని సాధించి ట్రోఫీని అందుకుంది. దానికంటే ముందు ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 330కి పైగా పరుగుల స్కోరును ఛేదించి సరికొత్త ప్రపంచ చరిత్రను సృష్టించింది.
దశాబ్దాల ఎదురుచూపు తర్వాత టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో ప్రశంసలు లభిస్తున్నాయి. దేశ ప్రధాని, రాష్ట్రపతి.. ఇలా లబ్ద ప్రతిష్టులైన వ్యక్తులంతా మన మహిళల సాధించిన విజయాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. వారు సాధించిన విజయాన్ని దేశం సాధించిన కీర్తిగా అభివర్ణిస్తున్నారు.. వన్డే వరల్డ్ కప్ సాధించిన నేపథ్యంలో టీమిండియా మహిళా ప్లేయర్లపై నజరానాల వర్షం కురుస్తోంది. ఇప్పటికే చాలామంది ప్లేయర్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నగదు సహాయాన్ని చేశాయి. అద్భుతమైన ఉద్యోగాలను కూడా కల్పించాయి. బిసిసిఐ ఏకంగా 51 కోట్ల నజరానా ప్రకటించింది. ఐసీసీ 39 కోట్ల నగదు బహుమతితో పాటు, ట్రోఫీని కూడా అందించింది.
వన్డే వరల్డ్ కప్ సాధించిన తర్వాత టీమిండియా మహిళా ప్లేయర్ల రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ముఖ్యంగా ప్లేయర్ల బ్రాండ్ వేల్యూ 35% పెరిగింది. దీంతో పర్సనల్ కేర్, బ్యూటీ, ఫ్యాషన్ విభాగాలు మాత్రమే కాకుండా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసు రంగాలు మహిళా ప్లేయర్లతో ఎండార్స్మెంట్ కుదుర్చుకోవడానికి తాపత్రయపడుతున్నాయి.. అయితే మహిళా ప్లేయర్లు బ్రాండ్ ముద్ర దక్కించుకోవాలంటే కనీస పరిమితి వారు దాటాల్సి ఉంటుందని రెడిఫ్యూజన్ చైర్మన్ సందీప్ పేర్కొన్నారు.. ” వన్డే వరల్డ్ కప్ సాధించిన తర్వాత మహిళా ప్లేయర్ల బ్రాండ్ వ్యాల్యూ పెరిగింది.. ఈ విలువ ఏకంగా 35 శాతానికి మించిపోయింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది.. కాకపోతే ప్లేయర్లు తమ పరిధి దాటాల్సి ఉంటుంది.. ఇప్పటి మార్కెట్లో అయితే పీవీ సింధుకు పెద్దగా డిమాండ్ లేదు.. ఆమెను 90 శాతం మంది గుర్తించడం లేదు. క్రికెటర్ గిల్ కూడా తన వ్యాల్యూ కోల్పోతున్నాడు. రాత్రి ఫోటో తో పాటు పేరు కూడా పక్కన పెట్టాల్సి వస్తోందని” సందీప్ పేర్కొన్నాడు. మరోవైపు ఇప్పటికీ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ వంటి ప్లేయర్లు తమ హవా కొనసాగిస్తున్నారు. బ్రాండ్ మార్కెట్ వేల్యూలో అంతకంతకు దూసుకుపోతున్నారని సందీప్ పేర్కొన్నాడు.