Digueesh Vs Abhishek : సాధారణంగా ఐపీఎల్లో ప్లేయర్ల మధ్య అంతగా గొడవలు జరగవు. అరుదైన సందర్భాల్లో మాత్రమే గొడవలు జరుగుతుంటాయి. ఓ విరాట్ కోహ్లీ – గౌతమ్ గంభీర్, ఓ గేల్ – షేన్ వాట్సన్.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దది. కాకపోతే వీరు గొడవ పడిన తర్వాత చాలా సంవత్సరాలుగా మాట్లాడుకోలేదు. అప్పట్లో సోషల్ మీడియా ఇంత బలంగా లేదు కాబట్టి.. ఇంతగా ప్రచారానికి నోచుకోలేదు. కానీ ఇప్పుడు అలా కాదు కదా.. సోషల్ మీడియా బలంగా ఉంది. ఆటగాళ్లు ఏమాత్రం మాట అదుపుతప్పినా.. చేతలు హద్దులు దాటినా వెంటనే సోషల్ మీడియాకు ఎక్కేస్తోంది. కావాల్సిన దానికంటే ఎక్కువ ప్రచారం లభిస్తోంది. అయితే ప్రస్తుతం ఐపీఎల్ నిర్వాహకులు కూడా ప్రచారాన్ని విపరీతంగా కోరుకుంటున్న నేపథ్యంలో.. చిత్రవిచిత్రమైన ప్రయోగాలు చేస్తున్నారు.. చీర్ లీడర్స్.. స్ట్రాటజిక్ టైం అవుట్ వంటి వాటితో ఆటకు అదనపు గ్లామర్ తీసుకొస్తున్నప్పటికీ.. అవి సరిపోవడంలేదని భావించారో తెలియదు కాని.. ఇటువంటి వివాదాలకు రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది.
Also Read : జుట్టుపట్టుకొని కొడతారేయ్.. దిగ్వేష్ కు అభిషేక్ వార్నింగ్.. వైరల్ వీడియో
ఈ వివాదం వల్ల కొద్ది రోజులపాటు ప్రధాన స్రవంతి మీడియాలో ఐపిఎల్ విపరీతమైన చర్చలో ఉంటుంది.. ఇక సోషల్ మీడియా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానుల మధ్య చర్చలు.. సోషల్ మీడియాలో యుద్ధాలు.. విశ్లేషకుల విశ్లేషణలు.. ఇలా ఐపీఎల్ మాత్రమే కనిపిస్తుంది. ఇలా ప్రచారం చేయడం వల్ల దండిగా ఆదాయం వస్తుందని నిర్వాహకుల నమ్మకం. పైగా పహల్గాం దాడి తర్వాత ఐపీఎల్ కు టెంపరరీ బ్రేక్ వచ్చింది. దీనివల్ల నిర్వాహకులకు భారీగానే నష్టం వచ్చింది. దీనిని పూడ్చుకోవాలంటే ఏదో ఒక రూపంలో ఐపీఎల్ కు విపరీతమైన ప్రచారం కల్పించాలి. ఆ ప్రచారాన్ని ఈ రీతిలోనైనా చేపట్టాలని ఆ నిర్వాహకులు ప్లాన్ చేశారని తెలుస్తోంది.
రియాల్టీ షోలకు ఏమాత్రం తీసిపోకుండా..
టీవీలలో వచ్చే రియాల్టీ షోలలో కంటెస్టెంట్ల మధ్య ఏదో ఒక గొడవను సృష్టిస్తారు. అది కొద్ది రోజులపాటు చర్చలో ఉంటుంది. తద్వారా ఆ షోలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి ప్రదర్శిస్తారు. తద్వారా రేటింగ్స్ పెరుగుతాయి. ఆ రేటింగ్స్ పెరిగితే ఆటోమేటిక్ గా యాడ్ రెవెన్యూ పెరుగుతుంది. అందువల్లే ఇటువంటి గొడవలకు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తారు.. అది ఇది అని తేడా లేదు.. హిందీ నుంచి మొదలు పెడితే తెలుగు వరకు ప్రతి రియాల్టీ షోలోనూ ఇదే జరుగుతోంది. ఇక తాజాగా దిగ్వేష్ రాటి, అభిషేక్ శర్మ మధ్య జరిగింది కూడా అలానే ఉంది. వాస్తవానికి శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే దూకుడుగా ఉంటాడు.. తోటి ఆటగాళ్లతో అత్యంత స్నేహంగా ఉంటాడు..దిగ్వేష్ రాటి మాత్రం వివాదాస్పద ఆటగాడు. క్రికెట్ తీయడమే ఆలస్యం సంతకం చేసుకుంటూ..అవుట్ అయిన ఆటగాడిని గేలి చేస్తుంటాడు.. సోమవారం నాటి మ్యాచ్లో దిగ్వేష్ రాటి ని అవుట్ చేసిన తర్వాత సంతకాల ప్లేయర్ గేలి చేశాడు. చివరికి అభిషేక్ శర్మ చేతిలో ఆగ్రహానికి గురయ్యాడు. ఈ వివాదం జరిగింది కొద్ది నిమిషాలు మాత్రమే అయినా.. ఐపీఎల్ నిర్వాహకులు కోరుకున్న దాని కంటే ఎక్కువ ప్రచారం లభించింది.
ఇక నిన్నటి నుంచి ఇవాల్టి వరకు మీడియాలో.. సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. తద్వారా డిజిటల్ ప్లాట్ఫారంలో వ్యూస్ అంతకుమించి అనే స్థాయిలో పెరిగిపోయాయి. ఫలితంగా నిర్వాహకులకు యాడ్స్ పరంగా దండిగా ఆదాయం వచ్చింది. ఇకపై హైదరాబాద్ ఆడే మ్యాచ్లకు ఇదే స్థాయిలో వ్యూయర్ షిప్ కనుక వస్తే ఇక తిరుగు ఉండదు. వాస్తవానికి ఆట ద్వారా ప్రేక్షకులను సమ్మోహితులను చేయాల్సిన చోట.. ఇలాంటి స్క్రిప్టెడ్ గొడవలను సృష్టించి.. ప్రేక్షకులను అయోమయానికి గురిచేసి.. ఏదో జరుగుతోంది అనే భ్రమ కల్పించి.. చివరికి తాము అనుకున్నది చేయడం వల్ల ఐపీఎల్ నిర్వాహకులకు తాత్కాలిక ఆనందం లభించవచ్చు గాని.. దీర్ఘకాలంలో ఇటువంటివి ఆటకు మాత్రమే కాదు.. ఐపీఎల్ నిర్వహణకు కూడా హానిచేస్తాయి. అన్నట్టు మైదానంలో గొడవపడ్డ దిగ్వేష్ రాటి, అభిషేక్ శర్మ.. మ్యాచ్ ముగిసిన తర్వాత ఒకరి భుజం మీద మరొకరు చేయి వేసుకొని సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో వెర్రి పప్పలు ఎవరయ్యా అంటే ప్రేక్షకులు మాత్రమే!