BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలికి జనవరి 12 ఆదివారం చాలా ప్రత్యేకమైన రోజు కాబోతుంది. దాదాపు ఒకటిన్నర నెలలు తర్వాత ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ బోర్డు కొత్త కార్యదర్శిని నియమించబోతుంది. భారత బోర్డులో అత్యంత శక్తివంతమైన స్థానం కార్యదర్శి పదవి . ఇప్పుడు ఈ పదవిని రెండు సంవత్సరాలకు పైగా బీసీసీఐతో అనుబంధం కలిగి ఉన్న దేవ్జిత్ సైకియా చేపట్టబోతున్నారు. ఆదివారం జరిగే బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో (ఎస్‌జీఎం) సైకియా పేరును అధికారికంగా ప్రకటిస్తారు. దీంతో దేశంలోని ప్రతి క్రికెట్ అభిమాని కూడా దేవ్జీత్ సైకియా ఎవరో తెలుసుకోవాలనుకుంటారు? ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డులో అత్యంత శక్తివంతమైన స్థానానికి ఎలా చేరుకున్నాడో తెలుసుకుందాం.
దాదాపు 56 ఏళ్ల దేవ్‌జీత్ సైకియా సాధారణ క్రికెట్ నిర్వాహకుడు కాదు. అతను స్వయంగా ఫస్ట్ క్లాస్ క్రికెటర్. ఏప్రిల్ 1969లో అస్సాంలోని గౌహతిలో పుట్టి పెరిగిన సైకియా తన పాఠశాల, కళాశాల రోజుల్లో క్రికెట్ కూడా ఆడాడు. అతను అస్సాం రాష్ట్ర జట్టులో కూడా చోటు సంపాదించాడు. 4 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాడు. సైకియా ప్రధానంగా వికెట్ కీపర్. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కూడా మ్యాచులు ఆడారు.
సీనియర్ జట్టులో చేరడానికి ముందు సైకియా 1984లో జూనియర్ స్థాయిలో BCCI అతి ముఖ్యమైన టోర్నమెంట్, సీకే నాయుడు ట్రోఫీలో పాల్గొన్నాడు. ఆ తర్వాత త్వరలోనే అస్సాం అండర్-15 జట్టు తరపున విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆడే అవకాశం అతనికి లభించింది. ఈ టోర్నమెంట్‌లో తన తొలి మ్యాచ్‌లోనే అతను అజేయంగా 55 పరుగులు చేశాడు. 1987లో తను అండర్-17 విజయ్ హజారే ట్రోఫీలో ఒడిశాపై అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ ప్రదర్శన ఆధారంగా తను త్వరలోనే సీనియర్ ఈస్ట్ జోన్ జట్టులో స్థానం పొందాడు. అక్కడ అతను సౌరవ్ గంగూలీ వంటి స్టార్లతో కూడా ఆడటం కనిపించింది. తరువాత 1989లో అతను రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి 4 మ్యాచ్‌లు ఆడాడు.
అతను క్రమంగా క్రికెట్ మైదానానికి దూరమయ్యాడు . తన చదువును కొనసాగించడానికి కేవలం 21 సంవత్సరాల వయస్సులో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. తన న్యాయ విద్యను పూర్తి చేసిన తర్వాత తను దీనినే తన వృత్తిగా చేసుకున్నాడు. సైకియా 1997లో గౌహతి హైకోర్టులో న్యాయవాదిగా తన ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. క్రమంగా ఆ ప్రపంచంలో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. 2021లో సైకియా అస్సాం అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆ పదవిని నిర్వహించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచారు.
సైకియా మైదానంలో క్రికెట్ కార్యకలాపాలకు దూరమై ఉండవచ్చు కానీ క్రికెట్ పట్ల అతని ప్రేమ చెక్కుచెదరకుండా ఉంది మరియు స్థానిక స్థాయిలో క్రికెట్ పరిపాలనలో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. 2014లో, అతను అస్సాం క్రికెట్ అసోసియేషన్ (ACA)లో కొనసాగుతున్న అవినీతికి వ్యతిరేకంగా కోర్టులో విజయం సాధించాడు. దీని తరువాత, 2016 లో అతను ACA ఉపాధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత 2019లో సైకియా మొదటిసారిగా ACA కార్యదర్శి అయ్యాడు. ఇక్కడి నుండి 2022లో BCCIలో జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు.
2024 డిసెంబర్‌లో జై షా ఐసీసీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి సైకియా తాత్కాలిక ప్రాతిపదికన బీసీసీఐ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బోర్డు రాజ్యాంగం ప్రకారం, ఏదైనా పదవి ఖాళీగా ఉంటే దానిని 45 రోజుల్లోపు భర్తీ చేయాలి. దీనికి ఎన్నికలు నిర్వహించాలి. ఈసారి కూడా అదే ప్రక్రియను అనుసరించి సైకియా కార్యదర్శి పదవికి నామినేషన్ దాఖలు చేశారు. అయితే, అతనికి వ్యతిరేకంగా మరే ఇతర అభ్యర్థి ముందుకు రాలేదు. కాబట్టి జనవరి 12న ఆయన అధికారికంగా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు